సాయంత్రం పూట ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ అనగానే… కరోనా మహమ్మారి గురించి ఏం చెబుతారా అనే టెన్షన్ తో ఎదురుచూస్తున్న సందర్భం ఇది. అయితే, ఆదివారం రాత్రి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రెస్ మీట్లో కాస్త ఊరటనిచ్చే అంశాలే చెప్పారు. రాష్ట్రంలో 70 కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయన్నారు. వారిలో 11 మందికి చికిత్స పూర్తయిందనీ, వరుస టెస్టుల్లో నెగెటివ్ అని వచ్చిందనీ, సోమవారం డిశ్చార్జ్ చేస్తున్నట్టు చెప్పారు. ఆ తరువాత, 58 మంది కరోనా పేషెంట్లు మిగులుతారనీ, వారి పరిస్థితి కూడా నిలకడగానే ఉందన్నారు.
ప్రస్తుతం క్వారంటైన్ ఉన్నవారికి కూడా వచ్చే నెల 7తో గడువు ముగుస్తోందన్నారు కేసీఆర్. 25,935 వైద్య పర్యవేక్షణలో క్వారంటైన్లో ఉన్నారనీ, వారిలో కరోనా లక్షణాలు ఎవ్వరికీ లేవన్నారు. సోమవారం నుంచి వీళ్లని కూడా దశలవారీగా ఇళ్లకు పంపించే ప్రక్రియ ప్రారంభమౌతుందన్నారు. విదేశాల నుంచి వ్యాధి వచ్చే అవకాశం ఇప్పుడు లేదనీ, పక్క రాష్ట్రాల నుంచి ఛాన్స్ లేదనీ, కొత్తగా కరోనా కేసులేవీ నమోదు కాకపోతే.. ఏప్రిల్ 7 నాటికి రాష్ట్రంలో కరోనా బాధితులే ఉండన్నారు ముఖ్యమంత్రి. అయితే, అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందనీ, ఏ క్షణం ఇది ఎలా విజృంభిస్తుందో తెలీదన్నారు. ప్రజలు లాక్ డౌన్ కి బాగానే సహకరిస్తున్నారన్నారు. ప్రస్తుతానికి పరిస్థితులు అదుపులో ఉన్నాయనీ, ప్రజలు మాత్రం సోషల్ డిస్టెన్స్ పాటించాల్సిన అవసరం ఉందన్నారు. ఇదొక్కటే మనల్ని కాపాడేదన్నారు.
నిధుల విషయమై మాట్లాడుతూ… దేశంతోపాటు రాష్ట్రంలో కూడా అన్ని రకాల కార్యకలాపాలు ఆగిపోయాయనీ, ఆర్థిక వెసులుబాటు కూడా కొంత సమస్య ఉన్న మాట వాస్తవమే అన్నారు. అయితే, వచ్చే నెలలో పెద్ద ఎత్తున వరి, మొక్క జొన్న పంటలు చేతికి వస్తున్నాయనీ, ప్రతీ గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. రైతులకు కూపన్లు ఇస్తారనీ, దానిపై ఉన్న తేదీల్లో మాత్రమే వారి పంటల్ని కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్లాల్సి ఉంటుందన్నారు. ఇదే సమయంలో ప్రభుత్వ ఉద్యోగులు, ఎమ్మెల్యేల జీతాల గురించి మాట్లాడుతూ…. అవసరమైతే కొంత పెట్టాల్సి వస్తుందేమో అన్నారు. ఇది విపత్తు సమయం కాబట్టి, కొన్నాళ్లు సర్దుకుపోవాల్సిన పరిస్థితి రావొచ్చంటూ సంకేతాలు ఇచ్చారు. మొత్తానికి, కేసుల డిశ్చార్, క్వారంటైన్లో ఉన్నవారిని ఇళ్లకు పంపేస్తున్నామని చెప్పడం కొంత ఊరటను ఇచ్చే వార్తే. అయితే, కేసులు పెరగకుండా ఉండాల్సిన అవసరం ఉంది. అంటే.. లాక్ డౌన్ ను తు.చ. తప్పకుండా కొన్నాళ్లు కొనసాగించాల్సిన పరిస్థితి ప్రభుత్వానికి… సహకరించాల్సిన బాధ్యత ప్రజలకీ ఉంది. నిజానికి, కరోనా చైన్ తెగాల్సిన దశ ఇదే. అందరూ మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన సందర్భమూ ఇదే.