పరిశ్రమకు ఓ పెద్ద దిక్కు అవసరం అన్నది చాలా మంది `పెద్దల` మాట. దాసరి నారాయణ రావు లేని లోటు కనిపించినప్పుడల్లా ఈ మాటే వినిపించేది. దాసరి స్థానంలో తప్పకుండా ఒకరు రావాలని అంతా కోరుకునేవారు. ఆ ఒక్కరు చిరంజీవి అయితే బాగుంటుందని అందరి ఉవాచ.
చిరంజీవి కూడా అలాంటి ప్రయత్నాలు చేశారు కూడా. పరిశ్రమలో చిన్న చిన్న గొడవలు రేగినప్పుడు (ముఖ్యంగా మా గొడవ) చిరంజీవి సర్దుబాటు చేసేందుకు ముందుకొచ్చారు. చిన్న సినిమాలు బాగా ఆడినప్పుడు స్వచ్ఛందంగా ముందుకొచ్చి వాటిని అభినందించి, ప్రమోషన్లు కల్పించారు. మరీ ముఖ్యంగా ఆడియో, ప్రీ రిలీజ్ వేడుకలకు ముఖ్య అతిథిగా అవతారమెత్తి దాసరి లేని లోటుని తీర్చారు.
అయితే చిత్రసీమకు ఇప్పుడు అసలు సిసలు ఆపద వచ్చింది.కరోనా వల్ల… షూటింగులు ఆగిపోయి, ఆ ప్రభావం రెక్కాడితే గానీ డొక్కాడని కార్మికులపై పడింది. పేద కళాకారుల జీవితం అస్తవ్యస్తమైంది. ఈ పరిస్థితుల్లో సీసీసీ అనే సంస్థకు నాంది పలికి ఓ గొప్ప పనికి పూనుకున్నారు చిరు. ఈ విషయంలో పరిశ్రమలోని ఇతర పెద్దల్ని కలుపుకుపోయిన విధానంలో దాసరిని మరిపించారు చిరు. కరోనా వ్యాధి నివారణలో భాగంగా షూటింగుల్ని వాయిదా వేసిన తొలి కథానాయకుడు చిరునే. ఆరకంగా మిగిలిన వాళ్లందరికీ స్ఫూర్తి నిచ్చాడు. కార్మికుల కోసం పెద్ద మొత్తంలో డొనేషన్ అందించిన హీరో కూడా చిరంజీవినే.
ఇప్పుడు కరోనాపై ఓ పాట వచ్చింది. ఇందులో చిరు, నాగ్, సాయిధరమ్, వరుణ్ తేజ్ లు కనిపించారు. కోటి స్వరపరిచిన పాట ఇప్పుడు వైరల్ అవుతోంది. అసలు ఇలా ఓ పాట కంపోజ్ చేయించాలని, అందులో హీరోలు కనిపించాలనే ఆలోచన కూడా చిరుదే. మొత్తానికి ఆపద కాల సమయంలో చిత్రసీమని సంఘటిత పరిచి, ఓ పెద్ద దిక్కులా వ్యవహరించారు చిరు. ఈ విషయంలో చిరు `దాసరి` పాత్ర పోషించారనడంలో ఎవరికీ ఎలాంటి సందేహం లేదు. ఇక ముందు దాసరి లేని లోటు కనిపించదేమో..?