కరోనా వల్ల దేశ ఆర్ధిక వ్యవస్థ ఏ స్థాయిలో నష్టపోతోంది? ప్రపంచం పరిస్థితి ఏమిటి? అనే పెద్ద పెద్ద విషయాలు తరవాత ఆలోచిద్దాం. మన చుట్టూ, మన పరిసరాల్లోనే చిన్న చిన్న సమస్యలు పెద్ద భూతంలా మారి భయపెట్టబోతున్నాయి. అందులో అద్దె ఇంటివాసులది మరో దీన వ్యథ.
హైదరాబాద్ లోని మహా నగరాల్లో కొన్ని విచిత్రమైన సమస్యలు వచ్చి పడుతున్నాయి. ప్రస్తుతం దేశమంతా లాక్ డౌన్ నడుస్తోంది. నూటికి 75 శాతం ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోం పేరుతో ఇంట్లోనే ఉంటున్నారు. మిగిలిన 25 శాతం మంది బతుకు పోరులో కాలు బయట పెట్టాల్సిందే. ఉదయం నుంచి సాయింత్రం వరకూ, లేదా రాత్రి నుంచి ఉదయం వరకూ షిఫ్టుల రూపంలో పనిచేయాల్సివస్తోంది. అందులో డాక్టర్లు ఉన్నారు, వైద్య సిబ్బంది ఉంటారు, పారిశుధ్య కార్మికులు ఉంటారు, పాత్రికేయులు ఉంటారు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వ్యక్తులు ఉంటారు. ఇప్పుడు సమస్య అంతా వీళ్లతోనే. `మీమంతా ఇంట్లోనే ఉంటున్నాం. మీరేమో ఎక్కడెక్కడో తిరిగి వస్తున్నారు. మీలో ఎవరికైనా వైరస్ సోకవచ్చు కదా, ఇలా బయటకు వెళ్లే పనైతే.. మా ఇంట్లో ఉండొద్దు` అని యజమానులు నిర్మొహమాటంగా చెబుతున్నార్ట. ఇలాంటి పరిస్థితుల్లో ఇల్లు ఖాళీ చేసి, మరో ఇల్లు చూసుకోవడం అసాధ్యం. అలాగని ఉద్యోగాలు మానేసి ఇళ్లలో కూర్చోవడం కుదరని పని. దాంతో అద్దె ఇంటి వాసులు కొత్త కష్టాల్ని అనుభవించాల్సివస్తోంది. ఇద్దరు ముగ్గురు యువకులు ఒకే ఇంటిని షేర్ చేసుకోవడం, అద్దెని పంచుకోవడం మహా నగరాల్లో అలవాటైన విషయాలే. రూమ్మెట్స్ విషయంలో ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయట. ఇంటి పట్టునే ఉండే రూమ్మెట్స్, ఉద్యోగాల నిమిత్తం బయటకు వెళ్లే సహచరుల్ని.. రూమ్ ఖాళీ చేయమని అడుగుతున్నార్ట.
గేటెడ్ కమ్యునిటీల్లో మరో రకమైన ఇబ్బందులు వస్తున్నాయి. అక్కడ టోటల్ లాక్ డౌన్ వ్యవస్థ నడుస్తోంది. హైదరాబాాద్ లోని మియాపూర్ లో ఉన్న మై హోమ్స్ లాంటి గేటెడ్ కమ్యునిటీ లాక్ డౌన్ ని పటిష్టంగా అమలు చేస్తోంది. ఈ గేటెడ్ కమ్యునిటీ నుంచి ఎవ్వరినీ బయటకు వెళ్లనివ్వడం లేదు. వెళితే రానివ్వడం లేదు. నిత్యావసర వస్తువులన్నీ ఇంటికే సరఫరా చేస్తున్నారు. హైదరాబాద్ లోనే ఉండే చుట్టాలు, స్నేహితులు గేటెడ్ కమ్యునిటీలోకి అడుగుపెట్టడం అసాధ్యంగా మారుతోంది. ఇలాంటి పరిస్థితి దాదాపు అన్ని పెద్ద అపార్ట్మెంట్లలోనూ కనిపిస్తోంది.