కరోనా వల్ల అతలాకుతలమవుతున్న సినీ కార్మికుల్ని ఆదుకోవడానికి తెలుగు చలన చిత్రసీమ `సీసీసీ` ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. చిరంజీవి, నాగార్జున చెరో కోటి రూపాయల విరాళాన్ని సీసీసీకి అందించారు. చిరంజీవి అధ్యక్షతన ఈ ఛారిటీ పనిచేయబోతోంది. ఇప్పుడు సీసీసీకి మంచి స్పందన వస్తోంది. ఇప్పటి వరకూ ఎలాంటి ప్రకృతి విపత్తు సంభవించినా సినిమావాళ్లు ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళం ప్రకటించే వారు. ఈసారీ అదే జరిగింది. అయితే సీసీసీ ఎప్పుడు ఏర్పాటు చేశారో, అప్పటి నుంచీ విరాళాలన్నీ సీసీసీకే వెళ్తున్నాయి. ఇప్పటికే ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు అందజేసిన ప్రభాస్, రామ్చరణ్, ఎన్టీఆర్ లాంటి వాళ్లు సైతం ఇప్పుడు సీసీసీకి ప్రత్యేకంగా సహాయాన్ని అందిస్తున్నారు. బ్రహ్మాజీ లాంటి సహ నటులు సైతం తమ వంతు బాధ్యతగా సీసీసీకి విరాళాన్ని ప్రకటిస్తున్నారు. కనీసం రూ.10 కోట్ల రూపాయలైనా సీసీసీ ఖాతాకి చేరే అవకాశాలున్నాయి. సినీ కార్మికుల్ని ఆదుకోవడానికి ఇది పెద్ద మొత్తమే. ప్రభుత్వం ఎలాగూ తన వంతుగా సినీ కార్మికులకు చేయూత అందిస్తోంది. ఇప్పుడు సినిమా వాళ్ల ఆపన్న హస్తమూ అందుతున్నట్టైంది.