ఆటోమోబైల్ పరిశ్రమకు ఊపిరి తీస్తున్న కోవిడ్ -19… కొత్తగా ఊపిరి పోసే అవకాశం కూడా కనిపిస్తోంది. ఆటోమోబైల్ కంపెనీలన్నింటిలో .. వెంటిలేటర్ల ఉత్పత్తి చేయాలంటూ.. పెద్ద ఎత్తున ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేస్తున్నాయి. దేశంలో ఉన్న ఆన్ని కార్ల, ద్విచక్ర వాహన ప్లాంట్లలో ఉత్పత్తి ఆగిపోయింది. దీంతో.. కంపెనీలు తీవ్రమైన నష్టాల్లో కూరుకుపోతున్నాయి. అయితే.. అదే మిషనరీతో కొద్దిగా మార్పు చేర్పులతో.. వైద్య రంగంలో అత్యంత కీలకమైన వెంటిలేటర్ల తయారీ సాధ్యం అవుతుంది. ఇప్పుడు పెద్ద ఎత్తున వెంటిలేటర్ల అవసరం ఉంది. దీంతో ప్రభుత్వం.. వెంటిలేటర్లు తయారు చేయాలని కంపెనీలకు సూచనలు పంపింది. మహింద్రా అండ్ మహింద్రా ముందుకు.. తమ అంగీకారం తెలిపింది. ఆ తర్వాత మారుతీ సుజుకీ కూడా రంగంలోకి వచ్చేసింది.
నిజానికి ఇండియాలో ప్రభుత్వం ఆటోమోబైల్ కంపెనీలకు ఈ సూచనలు చేయక ముందే ట్రంప్.. అమెరికాలోని ప్రసిద్ధ కార్ల కంపెనీలకు ఈ ఆర్డర్ వేశారు. అక్కడ కూడా కార్ల ఉత్పత్తి నిలిచిపోయింది. అక్కడ పెద్ద ఎత్తిన కోవిడ్ కేసులు బయటపడుతున్నాయి. ఏడున్నర లక్షల వెంటిలేటర్లు అవసరం పడతాయని నిపుణులు అంచనా వేశారు. ప్రస్తుతం అమెరికా వద్ద లక్షన్నర మాత్రమే వెంటిలేటర్లు ఉన్నాయి. ఈ కారణంగా.. ట్రంప్.. ప్రత్యేక అధికారాలను ఉపయోగించి.. వారు కాదనకుండా.. ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు అక్కడ కంపెనీలు ఉత్పత్తి ప్రారంభించబోతున్నాయి.
కరోనా వైరస్.. శ్వాస క్రియ మీద దెబ్బకొడుతుంది. శ్వాస పీల్చడం కష్టం అవుతుంది. ఇలాంటి వారికి.. వెంటిలేటర్‌తో చికిత్స అందించాల్సి ఉంటుంది. ప్రపంచం మొత్తం కరోనా ప్రభావం చూపుతూండటంతో.. వెంటిలేటర్ల కొరత ఏర్పడింది. అభివృద్ది చెందిన అమెరికాలోనే అంతంతమాత్రంగా వెంటిలేటర్ల సౌకర్యం ఉంది. ఇక భారత్ లాంటి దేశాల్లో రాష్ట్రాల్లో వందల్లోనే వెంటిలేటర్లు ఉన్నాయి. కొనాలన్నా.. దొరకని పరిస్థితి ఉంది. ఇప్పటికిప్పుడు ఉత్పత్తి కూడా మెడికల్ డివైసెస్ తయారు చేసే కంపెనీలకు సాధ్యం కాదు. అందుకే… ఆటోమోబైల్ కంపెనీలను.. ప్రభుత్వాలు రంగంలోకి దింపుతున్నాయి.
అయితే.. ఇప్పటి వరకూ కార్లను తయారు చేసిన పరిశ్రమల్లో.. ఈ వెంటిలేటర్లు తయారు చేయడం అంత సులువు కాదనే అభిప్రాయం ఉంది. మెషినరీ కొంత మేర ఉపయోగపడినా… వాటిని తయారు చేయడానికి అవరసరమైన మేధోపరమైన హక్కులు.. నిపుణులు లభించడం కష్టమంటున్నారు. అయితే.. ఇప్పటికి గండం గట్టెక్కడానికి ప్రభుత్వాలకు అంతకు మించి మార్గం కనిపించడం లేదు.