విదేశాల నుంచి వచ్చిన వారే కోవిడ్ -19 వైరస్‌ను మోసుకొచ్చారని అనుకున్నారు. అలా ఊహించే ప్రభుత్వాలు .. విమానాశ్రయాల మీద దృష్టి పెట్టాయి. దేశంలో అత్యధికంగా బయటపడుతున్న కేసులు.. ఢిల్లీలో జరిగిన ఓ మతపరమైన సమావేశంలో పాల్గొన్న వారివే. మార్చి నెల మొదటి వారంలో ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో “తబ్లిగ్ ఏ జమాత్” పేరుతో మత పరమైన సమావేశాలు జరిగాయి. దీనికి దేశంలోని దాదాపుగా ప్రతీ జిల్లా నుంచి కొంత మంది హాజరయ్యారు. దశల వారీగా జరిగిన ప్రార్థనాల్లో వివిధ ప్రాంతాల వారు.. మూడు రోజుల పాటు పాల్గొన్నారు. ఆ తర్వాత వారంతా రైళ్లలో స్వస్థలాలకు చేరుకున్నారు. అయితే.. తమతో పాటు కరోనాను తీసుకొచ్చారు. ఆ విషయం బయటపడేదాకా వారికి కూడా తెలియదు.
ఢిల్లీ మత సమావేశాల్లో పాల్గొన్న వారికే ఎక్కువగా కోవిడ్ -19..!
ఢిల్లీలో మతపరమైన సమావేశాల్లో పాల్గొని.. వచ్చేసిన వారిపై ప్రభుత్వాలు ఎలాంటి నిఘా పెట్టలేదు. వారికి క్వారంటైన్ కూడా లేదు. ఎందుకంటే.. విదేశాల నుంచి వచ్చిన వారిపైనే ప్రభుత్వాలు నిఘా పెట్టాయి. వారిని ఇళ్లకు పరిమితం చేశారు. ఇలా ఢిల్లీ మతపరమైన సమావేశాలు పెట్టిన వారు మాత్రం. .. యధావిధిగా తమ కార్యకలాపాల్లో పాల్గొన్నారు. ఫలితంగా… మరింత మందికి వైరస్ సోకింది. ఇలా.. ఎంత మందికి కరోనా సోకిందనే దానిపై.. అధికారవర్గాలు టెన్షన్ పడుతున్నాయి. వారితో సన్నిహితంగా ఉన్న వారెవరో తెలుసుకుని.. వారందర్నీ క్వారెంటైన్‌కు తరలించేందుకు హైరానా పడుతున్నారు.
తెలంగాణలో ఆరుగురు మృతి..! దేశంలో అనేక మందికి సీరియస్ ..!
ఢిల్లీలో మత ప్రార్థనలకు వెళ్లిన వారిలో అత్యధికులు అరవై ఏళ్లు పైబడిన వారే. వారిలో చాలా మందికి కరోనా లక్షణాలు బయటపడుతున్నాయి. ఒక్క సారిగా.. శ్వాస సమస్యలు వచ్చి.. మరణిస్తున్నారు. వారిలో కరోనా వైరస్ బయటపడక ముందే చనిపోతున్నారు. హైదరాబాద్‌లో ఇలా ప్రార్థనలకు వెళ్లిన ఓ వ్యక్తి చనిపోయిన తరవాత కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. నిన్న ఒక్క రోజే.. ఆరుగురు మరణించారు. వీరందరూ ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లినవారే. ఆంధ్రప్రదేశ్‌లోనూ పరిస్థితి సీరియస్‌గా ఉంది. అక్కడ కాంటాక్ట్ కేసులు ఎక్కువగా ఉన్నాయి. ఇలా కాంటాక్ట్ కేసులు కూడా.. ఢిల్లీ సమావేశాలకు వెళ్లిన వారే. ఏపీ నుంచి ఢిల్లీ మత సమావేశాలకు ఐదు వందల మంది వెళ్లారని ప్రాథమికంగా తెలుసుకున్న ప్రభుత్వ వర్గాలు.. వారందర్నీ ట్రేస్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. వారితో సన్నిహితంగా ఉన్న వారినీ క్వారంటైన్ కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
చిన్న నిర్లక్ష్యం.. మొదటికే మోసం తెచ్చేస్తోందా..?
ఒక్క చిన్న నిర్లక్ష్యం మొత్తం ఎంత తీవ్ర విపరిణామాలకు దారి తీస్తుందో.. ఢిల్లీ మత ప్రార్థనల ద్వారా తేలిపోయిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఢిల్లీ మత ప్రార్థనలకు విదేశాల నుంచి కొంత మంది వచ్చారు. వారి ద్వారా.. అక్కడ ప్రార్థనలకు హాజరైన వారికి వచ్చింది. అక్కడ్నుంచి ఇతరులకు ట్రాన్స్ మిషన్ అయింది. ఇప్పుడు అందర్నీ గురించేందుకు అధికారవర్గాలు హైరానా పడుతున్నాయి. కోవిడ్ -19 విషయంలో… ఇలాంటి తప్పిదాలే్.. భారత్‌లో వ్యాప్తికి కారణం అవుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.