ఆదాయం పడిపోయింది.. ఉద్యోగులకు జీతాలిస్తమా..? ఇస్తే ఎంతిస్తం..? అని వ్యాఖ్యానించిన ఇరవై నాలుగు గంటల్లోనే.. నిర్ణయం తీసేసుకున్నారు. అందరికీ జీతాలు కోసేసి.. తాను ఉత్తినే అలా అనలేదని.. నిరూపించేశారు. ముందుగా ప్రజాప్రతినిధులకే ఎక్కువగా జీతాల కోత విధించారు. ముఖ్యమంత్రి నుంచి కింది స్థాయి ప్రజాప్రతినిధి వరరకూ అందరికీ వేతనాల్లో 75 శాతం కోత విధించారు. అంటే.. ఎమ్మెల్యేలకు రూ. లక్ష జీతం ఉంటే.. వారికి పాతిక వేలు మాత్రమే అందుతాయి. ఈ కోటాలో ఎవరికీ మినహాయింపు లేదు. అఖిలభారత సర్వీసు అధికారుల వేతనాల్లో 60 శాతం కోత విధించారు. నాలుగో తరగతి ఉద్యోగులు మినహా మిగతా అన్ని కేటగిరీల ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో సగం శాతం కోత విధించారు.
నాలుగో తరగతి ఉద్యోగులు, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాల్లో మాత్రం పది శాతం కోతతో సరిపెట్టారు. ఇక రిటైర్డ్ ఉద్యోగుల పించన్లలోనూ 50 శాతం కోత పెట్టారు. అన్ని ప్రభుత్వరంగ సంస్థలు, ప్రభుత్వ గ్రాంటు పొందుతున్న సంస్థల ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారుల మాదిరిగానే వేతనాల్లో కోత ఉంటుందని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతానికి ఒక్క నెల వేతనాల్లోనే కోత విధించినట్లుగా ప్రభుత్వం తెలిపింది. వచ్చే నెల పరిస్థితుల్ని బట్టి నిర్ణయం తీసుకుంటారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ కోతల వల్ల ప్రభుత్వంపై రూ. పదిహేడు వందల కోట్లు భారం తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడిన తర్వాత ఈ మొత్తాన్ని ఇస్తారా లేదా..అన్నదానిపై స్పష్టత లేదు.
ఉద్యోగులు ఇప్పటికే తమ ఒక రోజు వేతనాన్ని ముఖ్యమంత్రి సహాయనిధికి ఇస్తున్నట్లుగా ప్రకటించారు. దాంతో తగ్గిన సగం వేతనంతో పాటు.. ముఖ్యమంత్రి సహాయనిధికి ఇచ్చిన అదనపు మొత్తం కూడా వేతనం నుంచి కట్ అవుతుందని చెబుతున్నారు. కరోనా సహాయ నివారణ చర్యల్లో.., అత్యవసర సేవల కింద.. పాల్గొంటున్నవారి జీతాల్లోనూ కోత విధించడంలో.. ఉద్యోగవర్గాల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. అయితే.. ఇలాంటి పరిస్థితిని తెలంగాణ సీఎం కేసీఆర్ చాలా సులువుగా డీల్ చేయగలరు.