కోడలికి బుద్ది చెప్పి.. అత్త తెడ్డు నాకిందట..!… కాస్త ఘాటుగానే ఉన్న ఈ సామెత.. తెలంగాణ సర్కార్‌కు సరిపోతుంది. ఎందుకంటే.. మూడు రోజుల కిందట.. కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి… లాక్ డౌన్ చేసినప్పటికీ.. కార్మికులందరికీ జీతాలు ఇవ్వాలని.. ప్రైవేటు సంస్థలను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అవి ప్రైవేటు సంస్థలకు మాత్రమే వర్తిస్తాయి. ప్రభుత్వం మాత్రం.. ఆ ఆదేశాలను నైతికంగా కూడా.. పాటించాలనే ఆలోచన చేయలేదు. మూడు రోజులు తిరిగే సరికి ప్రభుత్వం ఉద్యోగుల జీతాలను కట్ చేసేసింది. అదీ కూడా.. సగానికి సగం తగ్గించేసింది. ఇప్పుడు ప్రభుత్వ ఆదేశాలను ప్రైవేటు సంస్థలు ఎలా అమలు చేస్తాయనే సందేహం ప్రారంభమయింది.
తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు కట్ చేయడం వల్ల నష్టం.. ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే కాదు.. అన్ని రంగాల్లో ఉన్న జీతాల ఆధారపడే ప్రతి ఒక్కరి మీద పడనుంది. ప్రభుత్వమే జీతాలు కట్ చేసినప్పుడు తాము ఎందుకు ఆ పని చేయకూడదని.. ప్రైవేటు వ్యాపార సంస్థలు అనుకోవడంలో తప్పు లేదు. పైగా.. ప్రభుత్వంలో అత్యవసరంగా పని చేస్తున్న విద్యుత్, ఆరోగ్య శాఖల వంటి ఉద్యోగుల జీతాలను కూడా తగ్గించారు. ప్రస్తుతం అనేక ప్రైవేటు పరిశ్రమలు నడవడం లేదు. ఉద్యోగులు ఖాళీగానే ఉన్నారు. అవకాశం ఉన్న చోట్ల ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు. ప్రభుత్వం పని చేస్తున్న వారికీ జీతాలు తగ్గించడం వల్ల ప్రభుత్వం ప్రైవేటు సంస్థలు .. వర్క్ ఫ్రం హోం చేస్తున్న వారికీ జీతాలు తగ్గించేందుకు ధైర్యం ఇచ్చినట్లయింది.
ప్రభుత్వ రంగంలో చాలా పరిమితంగానే ఉద్యోగులున్నారు. దాదాపుగా 80 శాతం మంది వేతన జీవులు ప్రైవేటు రంగంలోనే ఉపాధి పొందుతున్నారు. వీరందరూ లాక్ డౌన్ వల్ల సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ నెల 21వ తేదీ వరకూ అందరూ పని చేశారు .,.. ఒకటో తేదీన జీతాలు ఇచ్చే వ్యాపార సంస్థలన్నీ… 20 టు 20 హాజరీ సైకిల్‌ను అనసరిస్తాయి. పదో తేదీ తర్వాత జీతాలిచ్చే సంస్థలు ఒకటి నంచి నెలాఖరు రోజు వరకూ హాజరీని చూస్తాయి. ఈ లెక్కన ఒకటో తేదీన జీతమిచ్చే సంస్థలకు ఆర్థిక పరంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎదుకంటే.. అప్పటి వరకూ కార్యకలాపాలు బాగానే నడిచాయి. తర్వాత పరిరోజులు వ్యాపారాలు నిలిచిపోయిన సంస్థలు ఇబ్బంది పడతాయి. అయితే మానవతా దృక్పథంతో జీతాలు ఇవ్వాలని.. మెజార్టీ సంస్థలు నిర్ణయించుకున్నాయి. కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అవే చెప్పాయి. తెలంగాణ సర్కార్ కూడా అదే చేసింది. కానీ తెలంగాణ సర్కారే ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కోత విధించింది. ఇప్పుడు ప్రైవేటు సంస్థలు కూడా కేసీఆర్ తీసుకున్న నిర్ణయం ధైర్యంతో.. ప్రైవేటు ఉద్యోగుల జీతాల్లో కోత విధిస్తే.. దానికి తెలంగాణ ప్రభుత్వమే కారణం అవుతుంది.