నాలుగు రోజుల క్రితం ప్రభుత్వం తరపున వచ్చిన మంత్రి అచ్చెం నాయుడు, కళా వెంకట్రావుతో అన్ని విషయాలు స్పష్టంగా మాట్లాడుకొని దీక్ష విరమించారు ముద్రగడ. ఆ తరువాత మీడియాలో ఆయన దీక్షని ముగించిన తీరుని, ఆ సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలపై వివిద కోణాలలో రాజకీయ విశ్లేషణలు వచ్చేయి. వాటిలో చాలా మటుకు ఈ వ్యవహారంలో చంద్రబాబు నాయుడు ఆయనను బోల్తా కొట్టించి పై చెయ్యి సాధించారని నిర్ధారించాయి. ఆయనకి చంద్రబాబు నాయుడు మంత్రిపదవి ఆశ జూపారని, అందుకే ఆయన దీక్ష విరమించారని, త్వరలో ఆయన తెలుగు దేశం పార్టీలో చేరి మంత్రిపదవి చేపట్టబోతున్నారని వార్తలు వచ్చేయి. కాపులకు న్యాయం జరగకుండానే ఆయన దీక్ష విరమించి వారికి అన్యాయం చేసారని మాటలు కూడా వినిపించాయి.
ఆయన పోరాటానికి వెనుక నుండి మద్దతు ఇచ్చిన వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి ఆయనపై తీవ్ర ఆగ్రహంగా ఉన్నారనే మాటలు వినిపించాయి. ఎవరితోను సంప్రదించకుండా హటాత్తుగా దీక్ష విరమించేసి అటు కాపులకు, తనకు మద్దతు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డికి కూడా ముద్రగడ హ్యాండ్ ఇచ్చేరని విమర్శలు వెలువెత్తాయి.
కాపుల కోసం ప్రాణాలకు తెగించి ఈ వయసులో ఆమరణ నిరాహార దీక్షకి కూర్చొని ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తెచ్చి సాధ్యమయినన్ని హామీలు పొందారు. కానీ మీడియాలో తన దీక్ష గురించి, దాని ఫలితాల గురించి వచ్చిన వార్తలు, విశ్లేషణలు చూసి ‘అత్త కొట్టినందుకు కాదు ఏడ్చింది…తోడి కోడలు నవ్వినందుకే..’ అన్నట్లుగా ముద్రగడకి చాలా ఉక్రోషం వచ్చినట్లుంది.
అందుకే మళ్ళీ ఆయన మళ్ళీ ఇవ్వాళ్ళ కొంచెం కటువుగా మాట్లాడారు. తన దీక్ష 20శాతం మాత్రమే సఫలమయిందని చెప్పుకొంటూనే మళ్ళీ ప్రభుత్వం తనకు అనేక హామీలు ఇచ్చినందునే దీక్ష విరమించానని సంజాయిషీ చెప్పుకొన్నారు. ప్రభుత్వం మాట తప్పితే మళ్ళీ పోరాటం మొదలుపెడతానని హెచ్చరించారు. తుని విద్వంసంపై దర్యాప్తు చేయకుండా అమాయకులను జైలులో పెడితే చూస్తూ ఊరుకోబోనని హెచ్చరించారు. తను ఏ పార్టీలోను చేరడం లేదు ఏ మంత్రి పదవిని చేపట్టబోవడం లేదు అని స్పష్టం చేసారు.
అయితే ఇటువంటి వ్యవహారాలలో నిర్ణయాలు తీసుకొనేటప్పుడు సంబంధిత వ్యక్తులతో లేదా తన మద్దతుదారులతో చర్చించుకొని అడుగుముందుకు వేస్తే ఇటువంటి అవమానకర పరిస్థితులు ఎదుర్కోవలసిన అవసరం ఉండదు. ఆయన కాపు గర్జన సభ నిర్వహించే వరకు మాత్రమే అందరి సలహా సంప్రదింపులు తీసుకొన్నట్లు కనిపిస్తోంది.
సభలో అకస్మాత్తుగా రైల్ రోకో, రాస్తా రోకోలకు పిలుపునీయడం, అది తుని విద్వంసానికి దారి తీయడం, ప్రభుత్వంతో రాజీకి సిద్దం అవుతూనే ఆమరణ నిరాహార దీక్షకు కూర్చోవడం, బహిరంగ ప్రదేశంలో తన మద్దతుదారుల మధ్య దీక్ష చేయకుండా తన ఇంట్లో చేయడం, తనకు సంఘీభావం తెలిపేందుకు ఎవరూ రావద్దని ఏకాకిగా మిగిలిపోయి, పోలీసులకు సహకరించడం, దీక్ష విరమించే ముందు తనకు మద్దతు ఇస్తున్నవారిని కానీ కాపు నేతలను గానీ సంప్రదించకపోవడం, చివరిగా చంద్రబాబు నాయుడుని నొప్పించినందుకు క్షమాపణలు చెప్పుకొని కాపులకు రిజర్వేషన్లు ఇస్తే ఆయన కాళ్ళు కడుగుతానని, ఇదే నా ఆఖరి దీక్ష అని చెప్పడం వంటివన్నీ తప్పిదాల క్రిందే భావించవచ్చును. అందుకే విమర్శలు మూటగట్టుకోవలసి వచ్చింది. చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకొని ప్రయోజనం ఉండదు.