ఏప్రిల్ 14 తరవాత లాక్ డౌన్ ఎత్తేసే సూచనలు కనిపిస్తున్నాయి. వీటిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి గానీ, లాక్ డౌన్ ఎత్తేసినా, లేకపోయినా సినీ రంగానికి పెద్ద తేడా ఉండే అవకాశాలు లేవు. ఎందుకంటే ఏప్రిల్ 14న యధావిధి స్థితికి వచ్చేసినా – సినిమాలు తేరుకోవడానికి కొంత సమయం పడతాయి. ఏప్రిల్ లో కొత్త సినిమాలు బయటకు వచ్చినా చూడ్డానికి ప్రేక్షకులు సిద్ధంగా ఉంటారా అనేదే పెద్ద డౌటు. జన సమూహాల్ని ప్రోత్సహించే ఏ ప్రక్రియ అయినా మళ్లీ యధాస్ధితికి చేరుకోవడానికి కొంత సమయం పడుతుంది. పైగా సినిమా విడుదల ఆషామాషీ వ్యవహారం కాదు. ప్రచారానికే కొంత సమయం పడుతుంది. వేసవికి రావల్సిన సినిమాలు రీషెడ్యూల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముందు పెద్ద సినిమాలకు దారి వదలాలి. అయితే ఇలాంటి స్థితిలో పెద్ద సినిమాలు రిస్కు తీసుకునే అవకాశం లేదు. జనాల మూడ్ ఎలా ఉంటుందో చెక్ చేసుకున్న తరవాతే… కొత్త సినిమాల్ని వదలాలని నిర్మాతలు భావిస్తున్నారు.
అందుకే సినిమాల విడుదల విషయంలో దర్శక నిర్మాతలు ప్రస్తుతం ఏమాత్రం ఆలోచించడం లేదు. ప్రస్తుతం అందరి దృష్టీ ఏప్రిల్ 14పై ఉంది. లాక్ డౌన్ కొనసాగుతుందా, లేదా? అనే విషయంలో స్పష్టత వచ్చిన తరవాతే అసలైన కార్యాచరణ మొదలవుతుంది. ఈ విషయంపై ఓ అగ్ర నిర్మాత తెలుగు 360తో మాట్లాడుతూ “ప్రస్తుతం చాలా గందరగోళ పరిస్థితుల్లో ఉన్నాం. లాక్ డౌన్ ఎత్తేసినా సరే, సినిమాల్ని విడుదల చేసేందుకు ధైర్యం చాలడం లేదు. థియేటర్ల బందు మరి కొంత కాలం కొనసాగే అవకాశం ఉంది. మేమంతా సినిమాల విడుదల గురించి ఏమాత్రం ఆలోచించడం లేదు. ప్రజల ఆరోగ్యాలు బాగుండాలి. జన జీవనం సాధారణ స్థితికి చేరుకోవాలి. ఆ తరవాతే… వాళ్లు వినోదం గురించి ఆలోచిస్తారు. థియేటర్లకు రావడానికి ప్రేక్షకులు కాస్త తటపటాయిస్తారు. అది సహజం కూడా. లాక్ డౌన్ ఎత్తేసినా మళ్లీ పరిస్థితి యధాస్ధితికి చేరుకోవడానికి కనీసం నెల రోజులైనా పడుతుంది. ఏప్రిల్. మేలలో కొత్త సినిమాలేవీ రాకపోవొచ్చు. ఈ వేసవి కరోనాకి బలి అయినట్టే” అని వివరణ ఇచ్చారు. దీన్ని బట్టి నిర్మాతల ఆలోచన పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవొచ్చు. సో.. లాక్ డౌన్ ఎత్తేసినా – మళ్లీ కొత్త సినిమాల హడావుడి చూడాలంటే మరి కొన్నాళ్లు అదనంగా ఎదురు చూడాల్సిందే.