పూరి జగన్నాథ్ ఆలోచనలు ఎప్పుడూ విభిన్నంగానే ఉంటాయి. ఒక్కోసారి గురువు రాంగోపాల్ వర్మని `మించి`పోతుంటాడు. తన లైఫ్ స్టైల్ కూడా అలానే ఉంటుంది. కరోనా తరవాత తన దైన స్టైల్లో వీడియోలు పోస్ట్ చేశాడు. మానవజాతికి సందేశం ఇచ్చాడు. ఇప్పుడు ఓ సరికొత్త స్టేట్మెంట్ ఇచ్చాడు. మనుషులంతా పెళ్లిళ్లు చేసుకోవడం మానేయాలన్న సలహా అందించాడు.
ఈ భూమికి పట్టిన వైరస్ మనిషే అని, జనాభా ఎక్కడికక్కడ పెరుగుతూ పోతోందని, మనిషి తప్ప మరో జీవికి ఈ భూమ్మీద చోటు లేకుండా చేస్తున్నామని, పెళ్లిళ్లు చేసుకోవడం ఆపేసి, జనాభా తగ్గించుకోవాలని, తద్వారా మరో జంతువుకీ ఈ భూమ్మీద జీవించే అవకాశం కల్పించాలని సూచించాడు. ప్రపంచ దేశాలన్నీ జనాభాని తగ్గించుకోవడానికి ప్రయత్నించాలని, సంతానోత్పత్తి ఆపేయాలని, లేదంటే జంతువులన్నీ అంతరించిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించాడు. ప్రపంచంలో పెట్రోలు, డీజీలూ ఆపేసే రోజులు దగ్గర పడ్డాయని, కొన్ని దేశాలు ఇప్పటికే 2022 తరవాత పెట్రోలు, డీజిలుతో నడిపే వాహనాలు వాడొద్దని ప్రజలకు చెప్పేశాయని గుర్తు చేశాడు పూరి. ఈ కర్ఫ్యూని ఎదిరించి బయటకు తిరిగేసేవాళ్లంతా ఓ విషయం గుర్తించుకోవాలని, కరోనా వైరస్ నుంచి బయటపడగానే మరో రెండేళ్ల పాటు ఎక్కువ కష్టపడి పనిచేయాల్సివస్తుందని, ప్రపంచమంతా ఆర్థిక మాంధ్యాన్ని చూడబోతోందని హెచ్చరించాడు.