జల్సా సినిమాలో వాటర్ ఫౌంటెన్ సీన్లో.. పవన్ కల్యాణ్ చాలా నార్మల్‌గా బ్రహ్మీని అడుగుతాడు… ఏమీ తేడా అనిపించడం లేదా..? కొంచెం కూడా తేడా అనిపించడం లేదా..? అని. ఇప్పుడు కరెక్ట్‌గా ఇదే టోన్‌లో వైసీపీ ఎన్నారై ఫ్యాన్స్‌కి , వాళ్లు చేసిన “అతి ఉత్సాహాన్ని” కవర్ చేసుకున్న సాక్షికి నెటిజన్ల నుంచి ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఎందుకంటే.. న్యూయర్క్ టైమ్స్ స్క్వేర్‌లో.. నార్త్ అమెరికాకు ఏపీ ప్రభుత్వ రిప్రజెంటేటివ్ హోదాలో.. రత్నాకర్ పండుగాయల అనే వ్యక్తి బిల్ బోర్డుపై ఓ ప్రకటన పెట్టించారు. ఆ ప్రకటన సారాంశం జగనన్న అమెరికాలో తెలుగు వారు ఎవరూ ఆందోళన పడవద్దని.. ఎన్నారైలందరికీ.. జగనన్న భరోసా ఇస్తున్నారనేది ఆ ప్రకటన సారాంశం. దీన్ని చూసే కొంచెం కూడా తేడాగా లేదా.. అనే ప్రశ్నలు వేస్తున్నారు.
న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ అంటే.. వరల్డ్ ఫేమస్. అందులో నో డౌట్. అక్కడ ప్రకటన ఇవ్వాలంటే… నిమిషానికి వందల డాలర్లలోనే చార్జ్ చేస్తారని చెబుతారు. అంత పే చేయడానికి సిద్దపడినా స్లాట్ దొరకడం కష్టమే. అయితే.. అది.. రెండు వారాల కిందటి వరకు. ఇప్పుడు టైమ్స్ స్క్వేర్‌లో పురుగు కూడా కనిపించడం లేదు. అత్యవసర సర్వీసులకు వెళ్లేవాళ్లు మాత్రం.. బిల్ బోర్డులవైపు చూసే తీరిక కూడా లేకుండా అటూ ఇటూ తిరుగుతూంటారు. ఎందుకంటే.. న్యూయార్క్ ఇప్పుడు కరోనా కోరల్లో చిక్కుకుంది. అక్కడ ప్రతి నలుగురిలో ఒకరికి వైరస్ సోకిందని రికార్డులు చెబుతున్నాయి. రెండు వారాల నుంచి న్యూయార్క్ లాక్డౌన్లో ఉంది. ఎవరూ ఉండని చోట.. ఎవరూ చూడని చోట ఎవరు మాత్రం ప్రకటనలు ఇస్తారు..?. అలా ఇచ్చే వారిని ఎలా చూస్తారు..? వైసీపీ నేతగా చెలామణి రత్నాకర్ పండుగాయల పరిస్థితి అదే. తనకు ఓ పదవి ఇచ్చారు కాబట్టి.. జగనన్న ఎన్నారైలకు భరోసా ఇచ్చినట్లుగా ఓ ప్రకటన ఎవరూ లైని టైమ్‌లో టైమ్స్ స్క్వేర్‌లో బిల్ బోర్డు ప్రకటన ఇచ్చి.. దాన్ని షూట్ చేసి.. సాక్షి ఆఫీసుకు పంపేశారు.
సాక్షి దానికి మరింతగా రంగులు అందింది. టైమ్స్ స్క్వేర్‌లో సాధారణ రోజుల్లో బిల్ బోర్డుపై ప్రకటనలు వచ్చేటప్పుడు.. కొంత మంది నిలబడి అలా చూస్తూంటారు. రత్నాకర్ పండుగాయల ఇచ్చిన జగనన్న భరోసా ప్రకటనను.. కూడా అమెరికా జనం అలా నిబిడాశ్చర్యంతో… వందల సంఖ్యలో గుమికూడి చూస్తున్నట్లుగా దృశ్యాలు జోడించి… సాక్షిలో ప్రసారం చేసేశారు. దాన్ని వైసీపీ సోషల్ మీడియా జనాలు.. జయహో జగనన్న అని ఉదరగొట్టడం ప్రారంభించారు. ఇక్కడే అందరూ.. మీకేం తేడా అనిపించడం లేదా..? కొంచెం కూడా తేడా అనిపించడం లేదా..? అన్న ప్రశ్నలు సంధిస్తున్నారు.
స్థానిక ఎన్నికలు వాయిదా వేసిన సమయంలో.. జగన్మోహన్ రెడ్డి కరోనా అసలు జబ్బే కాదని.. దానికి ఒక్క పారాసిటమాల్ టాబ్లెట్, గుప్పిడెంత బ్లీచింగ్ పౌడర్ చాలని.. వాదించారు. అధినేత మాటల్ని ఎన్నారై ఫ్యాన్స్ కూడా ఫాలో అయ్యారు. జగన్ మాటల్ని విమర్శించిన వారిపై … విరుచుకుపడ్డారు. కానీ ఇప్పుడు యూటర్న్ తీసుకుని మళ్లీ…సీరియస్ నెస్‌లోకి వచ్చేశారు. కరోనా అంటే.. ఒక అదీ.. ఒక ఇదీ అని చెబుతూ… జగనన్న భరోసా అనే ప్రకటనలు ఇచ్చేస్తున్నారు. ఈ ప్రకటనలు. సాక్షిలో ప్రసారమైన కథనాలు సోషల్ మీడియాలో చూస్తున్న ఎన్నారైలు పాపం.. అనుకుంటున్నారు.