కరోనా ఎఫెక్ట్ అన్ని రంగాలపై పడింది. మరీ ముఖ్యంగా ప్రైవేటు ఉద్యోగులపై తీవ్ర సంక్షోభాన్ని నెట్టింది. వర్క్ ఫ్రమ్ హోం కాన్సెప్టు అన్ని రంగాల్లోనూ తీసుకొచ్చారు. మీడియా కూడా అతీతం కాదు. నూటికి 50 శాతం ఇంటి నుంచే పని చేస్తున్నారు. షిఫ్టుల ప్రకారం ఆఫీసుకు వెళ్తున్నారు. ప్రింట్ మీడియా విషయంలోనూ ఇదే జరుగుతోంది. ఎప్పుడూ లేనిది వర్క్ ఫ్రమ్ హోం కాన్సెప్ట్ ప్రింట్ మీడియా కూడా అప్లై చేస్తోంది.
ఈనాడులో వర్క్ ఫ్రమ్ హోమ్ మొదలైంది. ఓ డెస్కులో 5 గురు సభ్యులు ఉన్నారనుకుంటే, వాళ్లలో ఇద్దరు మాత్రమే ఆఫీసుకురావాలి. మిగిలిన ముగ్గురూ ఇంటి నుంచి పని చేయాలి. కాకపోతే.. ఇంటి నుంచి పనిచేసే వాళ్లంతా సెలవలు పెట్టుకోవాలి. క్యాజువల్ లీవ్స్, సిక్ లీవ్స్, ఎర్న్డ్ లీవ్స్ వంటిని వాడుకోవాలి. ఇంటి దగ్గర పనిచేస్తూ.. సెలవు పెట్టుకోవడం ఎందుకన్నది ఈనాడు ఉద్యోగుల వాదన. కానీ… యాజమాన్యం మాత్రం `మీరు సెలవు పెట్టి, ఇంట్లోంచే పని చేయాలి` అంటూ ఒత్తిడి తీసుకొస్తుందని సమాచారం. అంతే కాదు… లాక్ డౌన్ వల్ల ఈనాడు పత్రికకు ఆదాయం భారీ మొత్తంలో తగ్గపోయింది. యాడ్లు లేకుండా పోవడంతో పేపర్ని మరీ కుదించేశారు. కేవలం 12 పేజీలకు పరిమితమైంది. జిల్లా పేపర్లు లేనే లేవు. ఈ రూపంలో కాస్త ఖర్చు తగ్గించుకోగలిగింది ఈనాడు. ఇప్పుడు దీని ప్రభావం వల్ల కొన్ని ఉద్యోగాలకు ప్రమాదం రానుంది. ఇప్పటికే ఈనాడులో పని చేసే దిగువ శ్రేణి ఉద్యోగులకు (బోయ్స్ లాంటివాళ్లు) ఈనాడు అధికారిక సెలవు ప్రకటించింది. `మీరు ఆపీసులకు రావాల్సిన అవసరం లేదు. ఇంటి పట్టునే ఉండండి` అని చెప్పింది. అయితే ఈ సెలవుల కాలంలో జీతాలు ఇస్తారో, ఇవ్వరో అనే విషయాన్ని మాత్రం చెప్పనే లేదు. కరోనా ఉధృతి తగ్గాత తమని తీసుకుంటారో లేదో అన్న భయాలు ఉద్యోగులలో ఉంది. అంతే కాదు.. రిటైర్మెంట్ అయిపోయినా, ఎక్సైన్షన్ వల్ల ఇంకా కొంతమంది ఉద్యోగాలు చేస్తూనే ఉన్నారు. అలాంటి వారు ఈనాడులో పదుల సంఖ్యలో ఉన్నారు. వాళ్లందరికీ త్వరలో శాశ్వత వీడ్కోలు తప్పదని తెలుస్తోంది. మొత్తానికి కరోనా ఎఫెక్ట్ ఈనాడు ఉద్యోగులపై బలంగానే పడింది.