రాంగోపాల్ వర్మ కెలుకుడికి చిర్రెత్తుకొచ్చినవాళ్లలో జొన్నవిత్తుల ఒకరు. ఇద్దరి మధ్య నువ్వా, నేనా? అంటూ వాదనలు జరిగాయి. టీవీ డిబేట్లలో ఇద్దరూ కూర్చుంటే మాంచి మసాలా సినిమా చూసిన థ్రిల్ కలిగేది ప్రేక్షకులకు. ఆర్జీవీపై జొన్నవిత్తుల ఎంత ఇరిటేట్ అయిపోయారంటే.. వర్మపై ఓ సినిమా తీసి, వర్మ వల్ల సమాజం ఏమైపోతుందో చూపించేయాలి అనిపించేంత. ఇప్పుడు అదే చేస్తున్నారు. ‘ఆర్జీవీ’ పేరుతో ఓ సినిమా ఇది వరకే మొదలెట్టారు. కరోనా ఎఫెక్ట్ వల్ల షూటింగు ముందుకు కదల్లేదు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలెడతానని చెబుతున్న జొన్న విత్తుల ‘ఆర్జీవీ’ టైటిల్ లోగోని ఆవిష్కరించారు. అంతేకాదు. ఆర్జీవీ అనే పదానికి కొత్త అర్థం చెప్పారు. ‘రోజూ గిల్లే వాడు’ అనే ట్యాగ్ లైన్ పెట్టాడు. అవును మరి.. ట్విట్టర్ ఖాతాలో చేరి, రోజూ ఏదో ఓ ట్వీట్ పెట్టి, ఎవరినో ఒకరిని గిల్లకపోతే.. ఆర్జీవీకి నిద్రపట్టదు. వర్మ ఈమధ్య కాలంలో తన సినిమాల కంంటే ట్వీట్ల ద్వారానే ఎక్కువ మందికి వినోదం పంచుతున్నాడు. వర్మకి తగిన ట్యాగ్ లైనే పెట్టాడు జొన్నవిత్తుల.