తెలుగు రాష్ట్రాల్లో కరోనా చాపకింద నీరులా విస్తరించిన విషయం ఆలస్యంగా వెలుగు చూస్తోంది. ఒక్క రోజులోనే… రెండు రాష్ట్రాల్లోనూ కేసుల సంఖ్య వంద దాటిపోయింది. ప్రస్తుతం తెలంగాణలో పాజిటివ్ కేసుల సంఖ్య 127 కాగా.. ఏపీలో ఈ సంఖ్య 111కి ఎగబాకింది. ఇప్పటి వరకూ పరిమితంగా టెస్టులు చేస్తూ వచ్చిన ఆంధ్రప్రదేశ్‌లో ఒక్క సారిగా వేగం పెంచారు. మొత్తం ఇప్పటి వరకూ 1313 మందికి టెస్టులు చేశారు. వీరిలో 111 మందికి కరోనా పాజిటివ్ ఉంది. తెలంగాణలో మొత్తం టెస్టుల సంఖ్య ఎంతో చెప్పకపోయినా… రెండు వేల వరకూ చేసి ఉంటారని అంచనా. ఇంకా పెద్ద సంఖ్యలో టెస్టుల ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది.
ఢిల్లీ మర్కజ్ సమావేశాలకు వెళ్లినవారితోనే అసలు ముప్పు తెలుగు రాష్ట్రాలకు పొంచి ఉంది. ప్రస్తుతం బయటపడతున్న పాజిటివ్ కేసుల్లో 90 శాతం … అక్కడి నుంచివచ్చిన వారివే…లేదా వారి ద్వారా ఇతరులకు అంటిన కాంటాక్ట్ కేసులే. దాంతో ప్రభుత్వాలు ఈ మర్కజ్ సమావేశాలకు వెళ్లిన వారిని ఉన్న పళంగా గుర్తించి.., క్వారంటైన్‌కు తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఏపీలో ఇంకా పలువుర్ని గుర్తించాల్సి ఉంది. తెలంగాణలో అందర్నీ గుర్తించామని అక్కడి ప్రభుత్వం చెబుతోంది. ఢిల్లీ మర్కజ్ కు వెళ్లిన వారందరికీ ప్రభుత్వం టెస్టులు చేస్తోంది. లక్షణాలు ఉన్నా లేకపోయినా.. టెస్టులు చేస్తున్నారు. వీరిలో పాజిటివ్‌గా తేలిన వారిలో చాలా మందికి కరోనా లక్షణాలు లేవు. ఇదే అధికార వర్గాలను టెన్షన్ పెడుతోంది.
ప్రస్తుతం లక్షణాలు ఉన్న వారినే అనుమానితులుగా గుర్తించి… టెస్టులు చేస్తున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన వారికి లక్షణాలు లేకపోయినా టెస్టులు చేయడంతో.. ఈ ప్రమాదకర సంకేతం బయటపడింది. ఇప్పుడు.. ఆయా వ్యక్తుల ద్వారా ఎంత మందికి.. వ్యాప్తి చెందింది.. వారి ద్వారా ఇంకెంత మందికి వ్యాప్తి చెందుతుదో అన్న టెన్షన్ అధికారవర్గాలకు ప్రారంభమయింది. సాధారణంగా వైరస్.. లక్షణాలు పధ్నాలుగు రోజుల్లో బయటపడతాయి. ఇప్పుడు.. ఆ తర్వాత కూడా బయటపడే అవకాశం ఉందన్న అంచనా ప్రారంభమయింది.