డిప్యూటీ సీఎం అంటే.. ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి అంతటివారు. అలాంటి పవర్ ఫుల్ వ్యక్తికి…ప్రగతి భవన్ గేట్లు తెరుచుకోలేదు. పైగా ఆయన హోం శాఖను చూసే మంత్రి. అయినప్పటికీ.. పోలీసులు ఆయన వాహనాన్ని అడ్డుకుని.. ముఖ్యమంత్రి అధికారిక నివాసంలోకి వెళ్లేందుకు పర్మిషన్ లేదని మొహం మీదనే చెప్పేశారు. దాంతో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ మొహం మాడ్చుకుని ప్రగతి భవన్ నుంచి తిరుగుముఖం పట్టారు. నిన్న సాయంత్రం హైలెట్ అయిన ఇష్యూ ఇది. మహమూద్ అలీ .. వ్యక్తిగత పని మీద.. ప్రగతి భవన్కు రాలేదు. ముఖ్యమంత్రి కరోనా అంశంలో…ఢిల్లీ మత ప్రార్థనల్లో పాల్గొనేందుకు వెళ్లిన వారి ఆచూకీ కనిపెట్టేందుకు .. హోంమంత్రిత్వ శాఖతో పాటు .. ఇతర అధికారులతో జరిపిన అత్యున్నత సమావేశంలో పాల్గొనేందుకు వచ్చారు.
ముఖ్యమంత్రి జరిపే సమీక్షలో హోంశాఖ కూడా పాల్గొనాలి కాబట్టి.. ఆ శాఖ మంత్రి అయిన మహమూద్ అలీకి సమాచారం వెళ్లిందని అధికారులు చెబుతున్నారు. ఈ మేరకే ఆయన ప్రగతి భవన్కు వచ్చారు. అయితే.. ఆయా శాఖల అధికారులు.. చివరికి పోలీస్ బాస్ అయిన డీజీపీని కూడా ప్రగతి భవన్లోకి అనుమతించారు కానీ.. మహమూద్ అలీకి మాత్రం నో ఎంట్రీ బోర్డు పడింది. అది యాధృచ్చికంగా చేసింది కాదని.. ఎవరికైనా తెలుస్తుంది. ప్రగతిభవన్ లోపలి నుంచి.. ఆయనను రానివ్వద్దని స్పష్టమైన సంకేతాలు రావడంతో.. పోలీసులు అడ్డుకుని ఉంటారు. లేకపోతే.. తమ శాఖ మంత్రిని పోలీసులు సీఎం ఇంటి గేటు వద్ద అడ్డుకునే సాహసం చేయలేరు.
ఎందుకు ఇలా జరిగిందన్నదానిపై.. తెలంగాణ రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. మర్కజ్ ప్రార్థనలకు వెళ్లిన వారిలో అత్యధికులు పాతబస్తీ వారే.. మహమూద్ అలీ కూడా ఆ ప్రాంతానికి చెందినవారే. సమీక్షల్లో ఏ నిర్ణయాలు తీసుకున్నా… బయటకు తెలిసిపోతుందనే ఉద్దేశంతోనే ఆయనను దూరం పెట్టినట్లుగా కొంత మంది చెబుతున్నారు. మరికొంత మంది మాత్రం.. కమ్యూనికేషన్ గ్యాప్ అంటున్నారు. అయితే.. ఇలాంటి విషయాలను డిప్యూటీ సీఎం మహమూద్ అలీ పట్టించుకోరు. లైట్ తీసుకుంటున్నారు. అలా ఉంటారు కాబట్టే .. ఆయన డిప్యూటీ సీఎం స్థాయికి ఎదిగారు.