సంచులు లేని కారణంగానే.. రేషన్ సాయాన్ని డోర్ డెలివరీ చేయలేకపోతున్నామని… పౌరసరఫరాల మంత్రి కొడాలి నాని తనదైన భాషలో చెప్పారు. అయితే.. సంచులు లేకపోవడం ఏమిటన్న చర్చ ఇప్పుడు ప్రారంభమయింది. ఎందుకంటే.. ఫిబ్రవరిలోనే.. సంచుల కోసమని ప్రభుత్వం రూ. 750 కోట్లను విడుదల చేసింది. ఫిబ్రవరి ఐదో తేదీన GO RT NO 4 ను విడుదల చేసింది. దీని ప్రకారం.. 19-09-2019న జారీ చేసిన జీవో నెంబర్ 1570 ప్రకారం.. బియ్యం సరఫరా చేసేందుకు అవసరమైన గోనె సంచులను కొనుగోలు చేసేందుకు రూ. 750 కోట్లు విడుదల చేస్తున్నట్లుగా ప్రభుత్వం తెలిపింది. ఏ ఖాతా నుంచి ఆ సొమ్ము తీసుకోవాలని ఆర్థిక శాఖ చాలా స్పష్టంగా ఫిబ్రవరిలో జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. సంచులు రాలేదా.. లేక నిధులు విడుదల చేయకుండా జీవోతోనే సరిపెట్టారా.. అన్న చర్చ నడుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లక్ష్యం ప్రభుత్వ పథకాల డోర్ డెలివరి. అది మేనిఫెస్టో హామీ మాత్రమే కాదు.. జగన్మోహన్ రెడ్డి.. ఎన్నికల ప్రచార సమయంలో … ప్రతీ చోట.. గట్టిగా అరిచి చెప్పిన హామీ. ఇప్పటికే.. రేషన్ సరుకును వాలంటీర్ల ద్వారా శ్రీకాకుళం జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా పంపిణీ చేస్తున్నారు. అయితే.. ఇప్పుడు కరోనా సాయాన్ని మాత్రం వాలంటీర్ల ద్వారా పంపిణీ చేయడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్ల వ్యవస్థ ఉన్నా.. లబ్దిదారుల్ని .. కిరాణా దుకాణాలకే రమ్మని చెబుతున్నారు దీంతో… వైరస్ ముప్పు ఉన్నా.. వందల మంది దుకాణాల వద్ద గుమికూడి కనిపిస్తున్నారు. దీనిపై విమర్శలు రావడంతోనే… సంచులు లేవనే… కారణం చెప్పారు మంత్రి.
కానీ సంచులకు రూ. 750 కోట్లు విడుదల చేసినట్లు జీవోలో స్పష్టమయింది. సాధారణం.. ప్రభుత్వ శాఖల్లో నిధుల విడుదల… పనులు పూర్తయిన తర్వాతే ఉంటాయి. అంటే.. గత ఏడాది సెప్టెంబర్లోనే సంచులకొనుగోలు నిర్ణయం తీసుకున్నారు.. కాబట్టి.. ఈ పాటికి కొనుగోలు ప్రక్రియ పూర్తయి సరుకు అంది ఉటుంది. అందుకే నిధుల విడుదల జీవో ఇచ్చి ఉంటారు. కానీ.. మంత్రి మాత్రం సంచులు లేకపోవడం వల్లే.. డోర్ డెలివరీ సౌకర్యం అందుబాటులోకి రాలేదంటున్నారు.