తెలంగాణలో అత్యవసర సేవలు అందిస్తున్న వైద్య ఆరోగ్య, పోలీసు సిబ్బందికి పూర్తి స్థాయి జీతం ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. అలాగే.. వారికి ఇన్సెంటివ్ కూడా ప్రకటించనున్నారు. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దీంతో జగన్మోహన్ రెడ్డి కూడా అదే నిర్ణయం తీసుకుంటారా..ఆంధ్రప్రదేశ్ అధికారవర్గాల్లో ప్రారంభమైంది. నిజానికి ఏపీ సర్కార్ మార్చి నెలకు సంబంధించి ఉద్యోగులందరికీ జీతాలు చెల్లించడానికి సిద్ధమైంది. నిధులు కూడా ఉన్నాయి. బిల్లులు కూడా రెడీ చేసుకుంది. కానీ కేసీఆర్ జీతాల కోత నిర్ణయం తీసుకోవడంతో.. దాన్ని అమలు చేయాలని జగన్ కూడా నిర్ణయించుకున్నారు. అప్పటికే పెట్టిన జీతాల బిల్లులన్నీ నిలిపివేసి.. కొత్త బిల్లులు రూపొందిస్తున్నారు. దీంతో జీతం ఒక్కరికి కూడా అందలేదు. మూడో తేదీన అందరికీ కోత పోను మిగతా జీతం అందుతుందని ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి.
అయితే.. ఈ లోపు తెలంగాణ సీఎం కేసీఆర్.. వైద్య, ఆరోగ్య, పోలీసు శాఖ లాంటి అత్యవసర సేవలు అందిస్తున్న వారికి పూర్తి జీతంతో పాటు ఇంటెన్సెవ్ కూడా ప్రకటించాలని నిర్ణయించడంతో.. ఇప్పుడు అదే నిర్ణయాన్ని ఏపీలో కూడా అమలు చేస్తారన్న చర్చ నడుస్తోంది. నిజానికి ఈ అత్యవసర సమయంలో…అందరూ ఇళ్లకే పరిమితమైనా… ఇరవై నాలుగు గంటలూ పని చేస్తోంది.. వైద్య ఆరోగ్య, పోలీసు శాఖలే . వారికి జీతాల కోత విధించడం అనే ఆలోచనే ప్రభుత్వానికి రాకూడదు. కానీ తెలంగాణ సీఎం ఆ నిర్ణయం తీసుకున్నారు కాబట్టి.. తాను కూడా తీసుకోవాలన్నట్లుగా.. ఏ మాత్రం ఆలోచన లేకుండా ఏపీ సీఎం కూడా అదే నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు కేసీఆర్.. అత్యవసర సేవలు అందించేవారికి జీతమే కాదు.. ఇన్సెంటివ్ కూడా ఇస్తున్నారు.
జగన్ కూడా.. అదే నిర్ణయాన్ని అమలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. లేకపోతే.. వైద్య ఆరోగ్య, పోలీసు శాఖల ఉద్యోగులు అసంతృప్తికి గురయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే కోత విధించిన జీతాల బిల్లులు ప్రిపేర్ చేసిన అధికారులు.. మరోసారి వాటిని మోడిఫై చేయాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చంటున్నారు. అయితే.. అన్ని నిర్ణయాల్లోనూ కేసీఆర్ ను ఫాలో అవుతున్నారన్న విమర్శలు ఎదుర్కొంటున్న ఏపీ సీఎం … వైద్య, ఆరోగ్య, పోలీసు శాఖల జీతాల విషయాల్లోనూ ఫాలో అవుతారా లేక… కోతకు కట్టుబడి ఉంటారా అనేది.. ఈ రోజే తేలిపోయే అవకాశం ఉంది.