ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిధులు ఉన్నప్పటికీ ఉద్యోగులకు జీతాలు సగానికి తగ్గించి ఇవ్వాలని చివరి క్షణంలో నిర్ణయించింది. అయితే.. ఆ నిధులన్నింటినీ ఏం చేసిందన్నదానిపై తెలుగుదేశం పార్టీ సంచలన ఆరోపణ చేసింది. గత రెండు రోజుల్లోనే… కొంత మంది ప్రభుత్వ పెద్దలకు దగ్గర అయిన బడా కాంట్రాక్టర్లకు రూ. ఆరు వేల నాలుగు వందల కోట్లు చెల్లించారని ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఈ మేరకు ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు దగ్గర్నుంచి మాజీ మంత్రి అచ్చెన్నాయుడు వరకూ .. తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. ఇది సరైన పద్దతి కాదని మండిపడుతున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో పని చేస్తున్న ఉద్యోగులకూ జీతాలు ఆపి.. కాంట్రాక్టర్లకు చెల్లించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
తెలుగుదేశం పార్టీ.. ఓ లెక్కాపత్రాన్ని విడుదల చేసింది. దీని ప్రకారం.. గత ఏడాదితో పోలిస్తే..ఈ ఏడాది రూ. ముఫ్పై వేల కోట్ల నిధులు ప్రభుత్వానికి చేరాయి. ఇందులో చేసిన అప్పులు కూడా ఉన్నాయి. ఏ రూపంలో అయినా.. గత ఏడాదితో పోలిస్తే రూ. 30వేల కోట్లు అదనంగా వచ్చినప్పుడు.. భారీ అభివృద్ధి పనులు ఏవీ చేపట్టనప్పుడు.. జీతాలు కూడా.. ఇవ్వలేనంత దుస్థితికి ఎందుకు వెళ్లిపోయారనే ప్రశ్నను టీడీపీ వేస్తోంది. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేమన్న ప్రకటన చేసిన తర్వాతనే కాంట్రాక్టర్లకు అన్ని వేల కోట్లు ఎలా చెల్లిస్తారన్నది అంతుబట్టకుండా ఉందని.. టీడీపీ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం దేశంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా… దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు అత్యంత జాగ్రత్తగా ఉంటున్నాయి. కరోనాను ఎదుర్కొనేందుకు తప్ప.. ఇతర అంశాలపై దృష్టి పెట్టడం లేదు. ఎంత ఎక్కువ వీలైతే.. అంత ఎక్కువగా నిధులు అందుబాటులో ఉంచుకుంటున్నారు. అయితే..ఏపీ సర్కార్ మాత్రం కరోనా పేరుతో ఉద్యోగుల జీతాలకు కోత పెట్టి మరీ భారీగా కాంట్రాక్టర్లకు చెల్లింపులు చేయడం.. అసాధారణంగా మారిందనే విమర్శలు వస్తున్నాయి. నిజంగానే ఈ చెల్లింపులు జరిగి ఉంటే… ఎవరెవరికి.. ఎంత మొత్తంలో .. ఏ ఖాతాలో చెల్లింపులు చేశారో.. ప్రజలకు ప్రభుత్వం వివరిస్తే..బాగుంటుంది. లేకపోతే… ప్రభుత్వం తీరుపై ప్రజలతో పాటు.. ఉద్యోగుల్లోనూ తీవ్ర అసంతృప్తి ప్రారంభమయ్యే అవకాశం ఉంది.