కరోనాపై ప్రపంచం అంతా పోరాడుతోంది. లాక్ డౌన్ వల్ల.. ఎక్కడి పనులకు అక్కడ పుల్ స్టాప్ పడిపోయింది. ఈ పోరాటానికి సినీ సెలబ్రెటీలు తమ వంతు సహకారం అందిస్తున్నారు. స్టార్లంతా.. భారీ మొత్తంలో విరాళాలు ప్రకటించారు. చిరంజీవి నుంచి శ్రీకాంత్ వరకూ దాదాపు హీరోలంతా స్పందించారు. అయితే నందమూరి బాలకృష్ణ నుంచి మాత్రం ఎలాంటి విరాళ ప్రకటనా రాలేదు. ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లో బాలయ్య మౌనంగా ఉండడం పట్ల రకరకాల కామెంట్లు వినిపించాయి. సోషల్మీడియాలో అయితే సెటైర్లు వేసుకున్నారు. బాలయ్య కోటి రూపాయల సహాయం ప్రకటించాడన్న తప్పు వార్తలు కూడా చక్కర్లు కొట్టాయి. ఆ రకంగానూ బాలయ్యని ఆడుకున్నారు.
అయితే ఎట్టకేలకు బాలయ్య స్పందించాడు. కోటి కాదు… దానికి పాతిక లక్షలు ఎక్కువే వేసి, కోటి పాతిక లక్షల విరాళం ప్రకటించాడు. రెండు తెలుగు రాష్ట్రాలకూ చెరో రూ.50 లక్షలు, సినీ కార్మికుల సంక్షేమం కోసం పాటు పడుతున్న సిసిసి కీ మరో పాతిక లక్షలు అందజేశాడు. స్వయం నిబంధనలతో ఇంట్లోనే ఉండి, ఈ విపత్తును ఎదుర్కోవాలని, కరోనాని అరికట్టడంలో అందరూ భాగస్వాములు కావాలని తన అభిమానులకు పిలుపునిచ్చాడు.