ఎన్టీఆర్ – దాసరి నారాయణరావు కాంబినేషన్ ఎప్పుడూ సూపర్ హిట్టే. ఇద్దరి మధ్య అనుబంధమూ అంత స్ట్రాంగ్ గా ఉండేది. ఎన్టీఆర్ కథ కూడా వినకుండా ‘మీతో సినిమా చేస్తా బ్రదర్’ అని మాటిచ్చేంత నమ్మకం కూడగట్టుకున్న అతి కొద్దిమంది దర్శకులలో దాసరి ఒకరు. అయితే ఒకానొక సందర్భంలో దాసరిపై ఎన్టీఆర్ కోపగించుకున్నారు. ‘మీరు చేసే పనేమైనా బాగుందా బ్రదర్..’ అంటూ మందలించారు. ఈ విషయాన్ని ఓ సందర్భంలో దాసరే స్వయంగా చెప్పారు. ఆ వివరాల్లోకి వెళ్తే..
ఏవీఎమ్ స్టూడియోలో… బొబ్బిలిపులి షూటింగ్ జరుగుతోంది. ఉదయం ఏడింటికల్లా తొలి షాట్ తీయాలన్నది ఎన్టీఆర్ నియమం. ఆయన ఆరింటికే సెట్‌కి వచ్చేస్తారు. ఆరోజూ అలానే సెట్ కి వచ్చారు. ఆ సమయానికి దాసరి సెట్లో కూర్చుని క్లైమాక్స్ డైలాగులు రాసుకోవడం కనిపించింది. సెట్లో కూర్చుని దాసరి డైలాగులు రాయడం ఇది వరకే.. ఎన్టీఆర్ చాలాసార్లు చూశారు. నిజానికి ఎన్టీఆర్ పనితీరుకి అది విరుద్ధమైన విషయం. సెట్లో షూటింగ్ మాత్రమే చేయాలని, స్క్రిప్టు పనులు, డైలాగులు మార్చడం తప్పన్నది ఎన్టీఆర్ ప్రగాఢ విశ్వాసం. కానీ దాసరి స్టైల్ వేరు. ఆయన బెటర్ మెంట్ కోసం ఎప్పటికప్పుడు మార్పులు చేస్తూ ఉంటారు. పైగా ఒకేసారి నాలుగైదు సినిమాలకు పనిచేయడం వల్ల – ఆయన చేతిలో సమయం ఉండేది కాదు. ఎప్పటికప్పుడు వేడి వేడిగా డైలాగులు రాసి అందించాల్సిందే. ‘నేను సెట్‌కి రాకముందు చేయాల్సిన పని ఇది. ఇప్పుడు సెట్లో కూర్చుని డైలాగులు రాయడం ఏమిటి బ్రదర్’ అని దాసరిపై కోపగించుకుని అక్కడి నుంచి ఇంటకి వెళ్లిపోయారు ఎన్టీఆర్.
దాంతో.. ఏవీఎమ్ స్టూడియో అంతా ఒకటే రచ్చ. ‘బొబ్బిలి పులి షూటింగు ఆగిపోయింది.. ఇక దాసరి పని అయిపోయినట్టే’ అంటూ రకరకాలుగా మాట్లాడుకున్నారు. ఈ విషయం దాసరి చెవిన కూడా పడింది. ఈ చిత్రానికి వడ్డే రమేష్ నిర్మాత. ఆయన హుటాహుటిన ఎన్టీఆర్ ఇంటికి వెళ్లారు. `ఈ సినిమాకి క్లైమాక్స్ సీన్ ప్రాణం. సంభాషణలు చాలా కీలకం. అందుకే దాసరి సెట్లో బెటర్ మెంట్ కోసం ప్రయత్నించాడు..` అని సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఎన్టీఆర్ శాంతించలేదు. ఆ తరవాత దాసరి వచ్చి… ఆయన రాసుకున్న డైలాగుల్ని యాక్షన్ తో సహా చేసి వినిపించారు. దాంతో ఎన్టీఆర్ కళ్లల్లో ఆనంద బాష్ఫాలు తిరిగాయి. ‘శభాష్ బ్రదర్.. డైలాగులంటే ఇలా ఉండాలి… గో ఎహెడ్’ అంటూ భుజం తట్టారు. మరుసటి రోజు ఏవీఎమ్ స్టూడియోలో యధావిధిగా `బొబ్బిలిపులి` షూటింగ్ ప్రారంభమైంది. ఆ సినిమాకి క్లైమాక్స్ ఎంత ఆయువు పట్టో, ఆ సంభాషణలు తెలుగునాట ఎన్ని ప్రకంపనాలు రేపాయో తెలియంది కాదు. అదీ.. బొబ్బిలి పులి క్లైమాక్స్ వెనుక కథ.