సినిమాకి పోటీగా, ధీటుగా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్ తయారవుతున్నాయి. భారీ బడ్జెట్లు, అదిరిపోయే కాస్టింగ్, దిమ్మ తిరిగే కంటెంట్ తో వెబ్ సిరీస్ లు ఆకట్టుకుంటున్నాయి. నవతరం హీరోలకూ ఈ వెబ్ సిరీస్‌లు రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానిస్తున్నాయి. భారీ పారితోషికాలు వస్తుండడంతో… వాళ్లూ వెబ్ సిరీస్ లలో నటించడానికి మొగ్గు చూపిస్తున్నారు. తాజాగా విశ్వక్ సేన్ కూడా త్వరలోనే వెబ్ సిరీస్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఆ విషయాన్ని విశ్వక్ కూడా ధృవీకరించాడు. త్వరలోనే ఓ వెబ్ సిరీస్‌లో నటించబోతున్నానని, ఆ కంటెంట్ మహా స్ట్రాంగ్‌గా ఉంటుందని, కథ నచ్చడం వల్లే… వెబ్ సిరీస్ చేయడానికి ఒప్పుకున్నానని క్లారిటీ ఇచ్చాడు.
మరో విషయం ఏమిటంటే.. `పెళ్లి చూపులు` దర్శకుడు తరుణ్ భాస్కర్ ఓ వెబ్ సిరీస్ తెరకెక్కించడానికి సిద్ధమయ్యాడు. `ఈ నగరానికి ఏమైంది` పేరుతో ఈ వెబ్ సిరీస్ రూపొందనుంది. ఈ పేరుతో ఓ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. అందులో విశ్వక్ సేనే కథానాయకుడు. బహుశా… విశ్వక్ నటించబోయే వెబ్ సిరీస్ కూడా అదే అయ్యుంటుంది. సినిమాలకు సీక్వెల్స్ రావడం సహజమే. వెబ్ సిరీస్‌లకు కూడా సీజన్ల పేరుతో సీక్వెల్స్ వస్తుంటాయి. అయితే ఓ సినిమాకి సీక్వెల్ గా ఓ వెబ్ సిరీస్ రావడం మాత్రం కొత్తే.