బంధువులు, సన్నిహితులు పేరుతో అనవసర వార్తలకు పేపర్లో స్సేస్‌ను కేటాయించే సంస్కృతి ఈనాడులో చాలా కాలం లేదు. కానీ ఇప్పుడు కొత్తగా తరం మారుతున్న కొద్దీ.. ఆ సంస్కృతి వస్తున్నట్లుగా ఉంది. ఎందుకంటే… కోవిడ్ -19 వైరస్ కు వ్యాక్సిన్ సిద్ధం చేస్తున్నారంటూ.. భారత్ బయోటెక్ కు చెందిన రేచస్ వీరేంద్రదేవ్ ఇంటర్యూను సగం పేజీలో ప్రచురించేశారు. దానికి మళ్లీ మొదటి పేజీలో కూడా.. మంచి స్పేస్ ఇచ్చారు. ఈ రేచస్ … వైరస్ పై వ్యాక్సిన్ కోసం పరిశోధనల్లో పాల్గొంటున్న శాస్త్రవేత్త కాదు. భారత్ బయోటెక్ .. ఆర్ అండ్ డీకి అధిపతి కాదు. పోనీ వ్యాక్సిన్ల రంగంలో నిపుణుడా అంటే..అదీ కాదు.. ఆయన కేవలం.. భారత్ బయోటెక్ వ్యాపారాభివృద్ధి విభాగానికి మాత్రం హెడ్. ప్యూర్ బిజినెస్. అంత మాత్రం దానికే.. ప్రపంచాన్ని గడగడలాడించేస్తున్న కరోనా వైరస్ కు కనిపెట్టబోయే వ్యాక్సిన్‌పై అంత పెద్ద ఇంటర్యూ ఎందుకు వేశారంటే… దానికి ఆయన మరో సైడ్ నుంచి అర్హత ఉంది.
అదే.. ఆయన ఈనాడు ఎండీ కిరణ్ అల్లుడు కావడం. కొవిడ్ -19 ను ఎదుర్కొనే విషయంలో.. వైద్య పరిశోధనా రంగం చేస్తున్న కృషి పై.. కొద్ది రోజులుగా ఈనాడు.. ఆ రంగం ప్రముఖులు.. సైంటిస్టులు.. డాక్టర్ల ఇంటర్యూలను ప్రచురిస్తోంది. చాలా మంది నిపుణుల ఇంటర్ఫ్యూలు పాఠకుల్ని ఆకట్టుకున్నాయి కూడా. అయితే.. భారత్ బయోటెక్ దగ్గరకు వచ్చే సరికి..వ్యాపార విభాగం చూసుకునే వ్యక్తి అభిప్రాయాలు కోవిడ్ -19 పై పోరాటానికన్నట్లుగా పబ్లిసిటీ చేయడమే… ఈనాడులో కూడా బంధుప్రీతి పెరుగుతోందన్న అభిప్రాయం రావడానికి కారణం అవుతోంది.
భారత్ బయోటెక్ ఫౌండర్లు కృష్ణా ఎల్లా, సుచిత్ర ఎల్లా … వ్యాక్సిన్ల విభాగంలో అద్భుతమైన విజయం సాధించారు. వారి అభిప్రాయాలు ప్రచురించి ఉంటే.. ఎంతో ఇంటెన్సిటీ ఉండేది. రామోజీరావు వియ్యంకులు అందుకే వేశారు అనే మాట ఎక్కడా వినిపించేది కాదు.. ఎందుకంటే.. వారు ఇలాంటి వైరస్‌పై పోరాటంలో విజయాలు ఇప్పటికే సాధించారు. కానీ రేచస్ ఇంటర్యూ మాత్రం అలా అనిపించేలా లేదు. ఈనాడు కూడా .. బంధుప్రీతికి తలొగ్గక తప్పడంలేదన్న వాదన మీడియా సర్కిల్స్‌లో వినిపిస్తోంది.