మర్కజ్ ప్రార్థనలకు వెళ్లిన వారికి అత్యధికంగా కరోనా వైరస్ సోకడం దురదృష్టకరమని.. అంతమాత్రాన.. మతం ముద్ర వేయడం సరి కాదని.. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఓ వీడియో సందేశాన్ని ఆయన కార్యాలయం మీడియాకు విడుదల చేసింది. దేశవ్యాప్తంగా సామూహిక అధ్యాత్మిక కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటాయని గుర్ు చేశారు. మర్కజ్ యాత్రికులకు ఇలా వైరస్ సోకడాన్ని ఆయన యాధృచ్చికంగా జరిగిన ఘటనగానే గుర్తించాలని కోరారు. వైరస్ కాటుకు కులం, మతం, ప్రాంతం, ధనిక, పేద తేడా ఉండదన్నారు. కరోనా వైరస్ సోకిన వాళ్లను తప్పు చేసినట్లుగా చూడవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రధానమంత్రితో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో.. జగన్మోహన్ రెడ్డి మర్కజ్ యాత్రికుల వల్లే రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగాయని… చెప్పారు. దీనిపై విస్తృత ప్రచారం జరగడంతో.. ఈ మేరకు.. ఇప్పుడు… వీడియో సందేశంలో.. మతం ముద్ర వేయడం సరికాదన్నట్లుగా ప్రకటించినట్లుగా తెలుస్తోంది.
వీడియో సందేశంలో.. ఆదివారం రాత్రి 9 గంటలకు అందరూ ఇళ్లలో లైట్లు ఆర్పేసి… తొమ్మిది నిమిషాల పాటు కొవ్వొత్తులు, టార్చ్‌లు వెలిగించి… సమైక్యత చాటుదామమని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. దేశ ప్రజలందరూ ఐక్యంగా కరోనాపై పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇలాంటి సమయంలో ఒకరికొకరు తోడుగా ఉండాలని.. కరోనా బాధితులపై ఆప్యాయత చూపాలని పిలుపునిచ్చారు. అదే సమయంలో జీతాలు సగానికి సగం తగ్గించాడనికి అంగీకరించిన ఉద్యోగులకు కృతజ్ఞతలు తెలిపారు. విపత్కర పరిస్థితుల్లో తమ ప్రాణాలను పణంగా పెట్టి సేవలు అందిస్తున్న వైద్యారోగ్యం, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బందికి పూర్తి జీతాలు చెల్లింస్తామని ప్రకటించారు.
దేశంలో కరోనా విలయం ప్రారంభమైన తర్వాత… జగన్మోహన్ రెడ్డి మీడియా ముందుకు రావడం ప్రారంభించారు. గత పది నెలల కాలంలో.. ఒక్క సారి కూడా మీడియా సమావేశం పెట్టలేదు కానీ.. కరోనా కారణంగా స్థానిక ఎన్నికలను వాయిదా వేసినప్పుడు మొదటి ప్రెస్‌మీట్ పెట్టారు. తర్వాత మరో రెండు ప్రెస్మీట్లు పెట్టినప్పటికీ… చాలా వరకూ సోషల్ మీడియాలో ట్రోల్ కావడంతో..రికార్డెడ్ వీడియో సందేశాలు విడుదల చేస్తున్నారు. ఇది రెండోది. రికార్డెడ్ వీడియోల్లోనూ.. ప్రిపేర్ చేసిన వాటిని చదివి వినిపిస్తున్నారు.