కరోనా వల్ల జన జీవితాలు అతలాకుతలం అయిపోయాయి. ఈ సమయంలో నిరు పేదలకు చేయూత నివ్వడానికి సినీ రంగం ముందుకొచ్చింది. ఎవరికి తోచిన రీతిలో వాళ్లు సహాయం చేస్తున్నారు. టాప్ హీరోల దగ్గర్నుంచి, క్యారెక్టర్ ఆర్టిస్టుల వరకూ తమ వంతు సహాయం అందించారు. అయితే హీరోయిన్లు మాత్రం ముందుకు రాలేదు. టాప్ హీరోయిన్లంతా కరోనా సహాయం విషయంలో మౌనంగా ఉన్నారు. అనుష్క, సమంత, తమన్నా… వీళ్లంతా ఇప్పటి వరకూ ఎలాంటి సహాయం అందించలేదు. దాంతో కథానాయికలకు సామాజిక బాధ్యత లేదా? అంటూ విమర్శలు మొదలయ్యాయి. ఇప్పుడు కథానాయికలు ఒకొక్కరుగా ముందుకొస్తున్నారు. కాస్త ఆలస్యంగానైనా స్పందించడం మొదలెట్టారు. నయనతార 20 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించింది. తమిళ సినీ కార్మికుల కోసం ఈ మొత్తం వెచ్చిస్తారు. ఇప్పుడు రకుల్ కూడా ముందుకొచ్చింది. గుర్గావ్లోని తన ఇంటికి సమీపాన ఉన్న ఓ మురికివాడలోని నిరు పేదలకు రకుల్ భోజన సదుపాయం కల్పిస్తోంది. ఈ రోజు నుంచి లాక్ డౌన్ ఎత్తేసే వరకూ అంటే… ఏప్రిల్ 14 వరకూ తాను వాళ్లకు భోజనం అందిస్తానని మాటిచ్చింది రకుల్. వీళ్లందరికంటే ముందు ప్రణీత రూ.1 లక్ష వితరణ ప్రకటించింది. చేతిలో సినిమాలు లేకపోయినా.. తనని ఇప్పుడు ఎవ్వరూ పట్టించుకోకపోయినా తన వంతు బాధ్యతగా, తనకు తోచిన సహాయం చేసింది ప్రణీత. మరి కోట్లకు కోట్లు సంపాదిస్తున్న స్టార్ హీరోయిన్లకు మాత్రం ఆ మనసు రాలేకపోయింది. ఇప్పుడైనా వాళ్ల సహాయం ప్రకటిస్తే అంతకంటే కావల్సిందేముంది?