కరోనా వైరస్ కారణంగా ప్రపంచం మొత్తం స్తంభించిపోయింది. నష్టపోని వ్యాపార రంగం లేదు. చరిత్రలో ఇప్పటి వరకూ.. ప్రపంచంలోని ప్రజలు అందరూ ఓ సంక్షోభం వల్ల.. నష్టపోయిన దాఖలాలు లేవు. మొదటి సారి ఆ విపత్తు కోవిడ్ -19 రూపంలోవచ్చింది. ఆర్థిక పునాదుల్ని పెకిలించివేస్తున్న ఈ వైరస్ ప్రభావం కొన్నింటిపై ఎక్కువ.. .మరికొన్నింటిపై తక్కువగా ఉంటోంది. వేటిపై ఎక్కువ.. వేటిపై తక్కువా అనేది వైరస్ ప్రభావం తగ్గిన తర్వాతే తేలుతుంది. ప్రస్తుతం.. “ఆన్ లైన్ షాపింగ్” బిజినెస్ చేసే కంపెనీలు ఈ ఉత్కంఠను ఎదుర్కొంటున్నాయి. తమ పరిస్థితి ఎలా ఉంటుందన్నదానిపై టెన్షన్‌కు గురవుతున్నాయి.
ఆన్ లైన్ షాపింగ్ స్టార్టప్‌లకు ఉపద్రవం తెచ్చి పెట్టిన కోవిడ్ -19..!
ఐదేళ్ల కిందటి వరకూ.. దేశంలో ఆన్ లైన్ షాపింగ్‌కు పెద్దగా ఆదరణ లేదు. కానీ ఇప్పుడు.. ఉప్పులు.. పప్పులు కూడా.. ఆన్ లైన్లోనే కొంటున్నారు ప్రజలు. అంతగా అలవాటు పడిపోయారు. ఆన్లైన్ షాపింగ్.. ప్రజల జీవన విధానంలో ఓ భాగంగా మారిపోయింది. ఖచ్చితమైన సేవలతో.. కంపెనీలు ప్రజల విశ్వాసాన్ని చూరగొన్నాయి. దేశీయ కుర్రాళ్లు ప్రారంభించిన స్టార్టప్‌లు.. స్నాప్ డీల్, ఫ్లిప్ కార్ట్ లాంటివి సంచలనం సృష్టించాయి. స్నాప్ డీల్ చతికిల పడిపోయినా… ఫ్లిప్ కార్ట్ మాత్రం… వాల్ మార్ట్‌కు రూ. లక్షా 75వేల కోట్లకు అమ్ముడుపోయింది. దాంతో అది కూడా విదేశీ కంపెనీ అయిపోయింది. అమెజాన్ ఎలాగూ విదేశీ కంపెనీనే. అయితే.. ఈ మూడు మాత్రమే కాదు.. కొన్ని వందల ఆన్ లైన్ బిజినెస్ స్టార్టప్‌లు ఇండియాలో ప్రారంభమయ్యాయి. కార్యాకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఫ్యాషన్, గ్రోసరీస్, మెబైల్ యాక్ససరీస్, మెడిసిన్స్ .. ఇలా చెప్పుకుంటూ పోతే.. దాదాపుగా ప్రతీ వస్తువును స్పెషలైజ్డ్గా..అమ్మేందుకు కొన్ని ఆన్ లైన్ షాపింగ్ పోర్టర్లు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఈ స్టార్టప్‌లలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు.. ఎంజెల్ ఇన్వెస్టర్స్ పెట్టుబడులు పెట్టారు. ఇవన్నీ.. ఇప్పుడు.. కొన్ని నడక ప్రారంభించగా.. మరికొన్ని పరుగులు పెడుతున్నాయి. ఎప్పటికప్పుడు.. ఫస్ట్.. సెకండ్..ధర్డ్ రౌండ్ ఇన్వెస్ట్మెంట్లను ఆకర్షిస్తూ.. అడుగులు ముందుకేస్తున్నాయి. అయితే.. కరోనా వైరస్ వారి ప్రయాణానికి ఒక్క సారిగా బ్రేక్ వేసేసింది. లాక్ డౌన్ తర్వాత పరిస్థితి ఏమిటన్నదానిపై సందేహాలను మిగిల్చింది.
లాభాల్లో ఉన్న ఆన్లైన్ షాపింగ్ ఫ్లాట్‌ఫామే లేదు..!
నమ్మకపోవచ్చు కానీ… ఇండియాలో ఆన్ లైన్ షాపింగ్ బిజినెస్ చేస్తున్న ఏ ఒక్క స్టార్టప్ కానీ.. కంపెనీ కానీ.. లాభాల్లో లేదు. చివరికి ఫ్లిప్ కార్ట్, అమెజాన్ కూడా.. కార్యకలాపాలు ప్రారంభించి చాలా కాలం అయినప్పటికీ.. ఒక్క త్రైమాసికంలో కూడా లాభాలు చూడలేదు. కనీసం.. బ్రేక్ ఈవెన్ కూడా సాధించలేదు. పైగా వందలు, వేల కోట్ల నష్టాన్ని చవి చూస్తూంటాయి. కానీ.. వాటికి పెద్ద ఎత్తున ఇన్వెస్ట్ మెంట్ ఉంది. నష్టాలు వచ్చినా… వెల్లువలా వచ్చి పడుతున్న పెట్టుబడులతో బండి నెట్టుకొస్తుంది. స్థిరపడిన తర్వాత ఒక్క సారి కంపెనీ బ్రేక్ ఈవెన్‌లోకి వస్తే… తిరుగు ఉండదు. అందుకే… వాటికి పెట్టుబడులు వస్తున్నాయి. కానీ.. ఇతర ఆన్ లైన్ షాపింగ్ ఫ్లాట్ ఫామ్స్ కు మాత్రం.. ప్రస్తుతం జీవన్మరణ సమస్యనే ఎదురవుతుంది. నెల రోజుల పాటు కార్యకలాపాలు నిలిచిపోవడం అంటే… మామూలు విషయం కాదు. మళ్లీ ఆయా కంపెనీలు తమ పనిని మొదటి నుంచి ప్రారంభించాల్సి ఉంటుంది. ఉద్యోగులకు జీతాలివ్వడం..నిర్వహణ ఖర్చులు.. ఇలా ప్రతీది అదనపు భారమే అవుతుంది. అప్పుల మీద.. ఇన్వెస్ట్మెంట్ల మీద నడిచే ఈ స్టార్టప్‌లకు కరోనా జీవన్మరణ సమస్యగా మారింది.
ముందు ముందు ఇన్వెస్ట్మెంట్ గగనమే..!
కోవిడ్ దెబ్బకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనం ఖాయమని చెబుతున్నారు. అంటే.. పెట్టుబడులు రావనే అర్థం. ఆన్ లైన్ వ్యాపారం చేయాలనుకున్న ఔత్సాహికులంతా… పెట్టుబడుల కోసమే చూస్తారు. తమ కొత్త ఆలోచనలను వారి ముందు ఆవిష్కరించి పెట్టుబడులు పొంది… కార్యకలాపాలు ప్రారంభిస్తారు. కరోనా విలయం పూర్తయిన తర్వాత.. మరో … రెండు, మూడేళ్ల పాటు.. ప్రపంచ పెట్టుబడిదారులందరూ… జాగ్రత్తగా ఉండే అవకాశం ఉంది. రిస్క్ తీసుకునేందుకు సిద్ధపడరు. దీంతో సహజంగానే పెట్టుబడుల ప్రవాహం తగ్గిపోతుంది. ఆ ఎఫెక్ట్.. ఆన్ లైన్ షాపింగ్ స్టార్టప్‌లు నడుపుతున్న వారిపైనే పడనుంది.
కరోనా దెబ్బ ఇప్పటికే భారీ కంపెనీలుగా ఎదిగిన ఫ్లిప్ కార్ట్, అమెజాన్ లాంటి వాటిపై పడదని అనుకోలేం. తమ ఆర్థిక మూలాలు బలంగా ఉన్నాయని.. ఆ కంపెనీలు చెబుతూ ఉండొచ్చు కానీ… కరోనా ఎంత భారీ దెబ్బ కొడుతుందో ఇంకా తేలలేదు. ఎలాగోలా ఈ సంస్థలు నిలదొక్కుకున్నా.. ఇప్పుడిప్పుడే ఉనికి చాటుకుంటున్న స్టార్టప్‌లకు మాత్రం చావు దెబ్బే.