ఆంధ్రప్రదేశ్‌లో లాక్డౌన్ అమలును ప్రభుత్వమే అపహాస్యం చేస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలని ఆదేశిస్తూ.. బయట ఎవరు కనిపించినా పోలీసులు లాఠీ చార్జ్‌కు వెనుకాడవద్దని ఆదేశించిన ప్రభుత్వం వివిధ కార్యక్రమాలు చేపడుతూ.. గుంపులుగా ప్రజలు ఉండేలా నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే రైతు బజార్ల వద్ద ఉదయం మొత్తం జనం గుంపులుగానే ఉంటున్నారు. ప్రభుత్వం కూడా రేషన్ పంపిణీ కోసం… ప్రజలు గుంపులుగా దుకాణాల ముందు ఉండేలా నిర్ణయం తీసుకుంది. ఇక వైసీపీ నేతలు ఎక్కడిక్కడ తమ స్థానిక ఎన్నికల ప్రచారంలో రాజీ పడటం లేదు. దాతలు ఇచ్చిన నిధులతో కట్టిన ఓ చిన్న వంతెనను ప్రారంభించడానికి పలమనేరు ఎమ్మెల్యే చేసిన హడావుడి హైలెట్ అయిపోయింది.
ఇక ప్రభుత్వం తరపున నగదు పంపిణీ జరిగిన సందడి .. గుంపులు.. గుంపులుగా సాగింది. అదే సమయంలో.. వైరస్ తరుముతోంది..ఎవరూ ఇంట్లోకి రావొద్దని ప్రచారం చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం… కొంత మందిని రోడ్ల మీదకు తీసుకు రావాలంటూ నేరుగా ఉత్తర్వులు జారీ చేస్తోంది. కలెక్టర్లకు.. భూసమీకరణ.. భూసేకరణ.. ఇళ్ల స్థలాల వంటి పనులు అప్పగించడే కాదు.. తాజా.. విద్యా శాఖకు ఓ టాస్క్ అప్పగించేసింది. ఆ శాఖకు లాక్ డౌన్ మినహాయింపులు ఎత్తివేయాలంటూ.. పోలీసులకు అధికారికంగా లేఖ వెళ్లింది. విద్యాశాఖ ఉన్నతాధికారుల నుంచే ఈలేఖ వెళ్లింది. పిల్లలకు పరీక్షలు నిర్వహించకూడదని… ఇప్పటికే నిర్ణయించారు. ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకూ.. ఎగ్జామ్స్ పెట్టడంలేదు. కరోనా పరిస్థితి పూర్తిగా చల్లబడిన తర్వాత.. టెన్త్ పరీక్షలు పెట్టాలనకుంటున్నారు. దాంతో విద్యాశాఖకు ఇప్పుడు పనేం లేదు.
కానీ.. ప్రభుత్వం ఆ శాఖ ఉన్నతాధికారులకు ఇచ్చిన టాస్క్… పరీక్షలు కాదు. నాడు – నేడు ప్రోగ్రాం కింద చేపట్టాల్సిన పనులను పూర్తి చేయడం. ప్రభుత్వం.. కొన్ని వేల కోట్ల రూపాయలు వెచ్చించి.. స్కూళ్లలో కొన్ని అభివృద్ధి పనులు చేయాలనుకుంది. ప్రహరిగోడలు, టాయిలెట్లు, రంగులు వేయించడం.. లాంటివి. ప్రస్తుతం లాక్డౌన్ కారణంగా ఆ పనులేమీ జరగడం లేదు. ఇప్పుడు.. ప్రారంభిస్తేనే.. మళ్లీ స్కూళ్లు ప్రారంభించేనాటికి పనులు పూర్తవుతాయనుకున్న ప్రభుత్వం పనుల్లోకి దిగాలని.. విద్యాశాఖ అధికారులను ఆదేశించింది. ఈ మేరకు.. కావాల్సిన వస్తవులను.. లాక్ డౌన్ లో ఉన్న దుకాణాలను తెరిపించి మరీ కొనుగోలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. కాంట్రాక్టర్లు, వర్కర్లను తీసుకొచ్చి పనులు చేయాలని ఆదేశించింది. విద్యాశాఖ వాహనాలకు అనుమతి ఇవ్వాలని ..వారి పనులను అడ్డుపడొద్దని పోలీసులకు కూడా మౌఖిక ఆదేశాలు వెళ్లాయి. కరోనా కారణంగా అందరూ బయటకు రాకుండా.. భయంతో ఇళ్లతో పరిమితమవుతున్నారు. ప్రభుత్వాలు కడా అదే చెబుతున్నాయి. కానీ ఏపీ సర్కార్ మాత్రం.. భిన్నంగా వ్యవహరిస్తోంది. ఒక్కో ప్రభుత్వ వవిభాగాన్ని రోడ్డు మీదకు తీసుకొస్తోంది. అంటే సామాన్యులకు మాత్రమే లాక్ డౌన్ అమలవుతోంది.