ఆత్మకథ రాసుకోవాలన్న ఆలోచన చిరంజీవికి ఎప్పటి నుంచో ఉంది. చాలాసార్లు ఈ విషయాన్ని బయటపెట్టారు కూడా. అయితే.. అది ఇప్పుడు కార్యరూపంలోకి వచ్చింది. లాక్ డౌన్ వల్ల షూటింగులు ఆగిపోయాయి. అంతా ఇంటిపట్టునే ఉండాల్సిన పరిస్థితి. ఈ సమయాన్ని చిరంజీవి ఆత్మకథ రాసుకోవడానికి ఉపయోగించుకుంటున్నారు. ఈ విషయాన్ని ఓ దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు చిరు. తన జీవితంలో జరిగిన కొన్ని ముఖ్యమైన సంఘటనల్ని వీడియో రూపంలో రికార్డు చేసుకుని భద్రపరచుకుంటున్నార్ట. సో.. చిరు ఆత్మ కథ పుస్తకం రూపంలోనే కాదు, వీడియో రూపంలోనూ రాబోతోందన్న మాట. ఆత్మకథ రాసుకోవడమేనా, ఇంకేమైనా చేస్తున్నారా.. అని అడిగితే అప్పుడప్పుడూ వంట గదిలో దూరి దోసెలు వేస్తున్నానని అంటున్నాడు చిరు.
చిరంజీవి దోసె చాలా ఫేమస్. చట్నీస్లో ఈ పేరుతో ఓ టిఫిన్ కూడా ఉంది. ఇంట్లో కూడా అప్పుడప్పుడు చిరు వంట గదిలో దూరి ప్రయోగాలు చేస్తుంటారు. బందు సమయం కదా. అన్ని వస్తువుల్నీ పొదుపుగా వాడుకోవాలి. అందుకే వంట గదిలో ప్రయోగాల జోలికి వెళ్లి, దుబారా చేయడం లేదని, అవసరమైనవి మాత్రమే వండుతున్నానని చెప్పుకొచ్చారు. మొక్కలకు నీళ్లు పోయడం, వ్యాయామం చేయడం, ఇంట్లో కూర్చుని పాత సినిమాలు చూడడం ఇదీ.. చిరు దిన చర్యగా మారింది.