ఆదివారం వచ్చిందంటే దిన పత్రిక కాస్త ప్రత్యేకంగా కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా సండే మైగజైన్ అదనంగా వస్తుంది. బోలెడంత సమాచారం, కాలక్షేపం. అందుకే ఆదివారం దిన పత్రిక కొనేవాళ్లు, చదివేవాళ్లు ఎక్కు. ఆ రోజు సర్క్యులేషన్ కూడా ఎక్కువే. దాంతో పాటు మిగిలిన రోజులతో పోలిస్తే.. ధర కూడా ఓ రూపాయి ఎక్కువే ఉంటుంది. అయితే కరోనా మహమ్మారి సండే మైగజైన్లనీ మింగేసింది. ఇప్పటికే లాక్ డౌన్ వల్ల, దిన పత్రిక సైజు క్షీణించింది. ఇప్పుడు ఆదివారం అనుబంధ పత్రికల్నీ ఎత్తేశాయి యాజమాన్యాలు. ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు ఆదివారం అనుబంధాన్ని ఇవ్వలేదు. కొన్ని కారణాల వల్ల ఆదివారం అనుబంధం అందివ్వలేకపోతున్నామని మాత్రం ప్రకటించాయి. సాక్షి ప్రత్యామ్నాయంగా.. పత్రికను టాబ్లాయిడ్ గా మార్చేసింది. నమస్తే తెలంగాణ మాత్రం యధావిధిగా సండేబుక్ (బతుకమ్మ) అందించగలిగింది. సండే మ్యాగజైన్ నిర్వహిచడం, వారం వారం అందించడం చాలా కష్టమైన వ్యవహారమే. పైగా ఖర్చుతో కూడిన పని. ఏ వంకతో సండే మ్యాగజైన్ని ఆపేయాలా అని ప్రధాన దిన పత్రికలన్నీ ఎదురుచూస్తుంటాయి. ఇప్పుడు వాళ్లకు కరోనా సాకుగా కనిపించింది. మరి ఈ ఎత్తివేత ఈ వారం మాత్రమేనా, కరోనా ప్రభావం తగ్గేంత వరకూ కొనసాగుతుందా అనేది మాత్రం ఇప్పుడే చెప్పలేని పరిస్థితి.