మనమంతే బ్రదర్
చూసి రమ్మంటే కాల్చొస్తాం
పిలుస్తే చాలని చెబితే
పిప్పి పిప్పి చేస్తాం.
మనమంతే బ్రదర్!
కరోనా కార్చిచ్చు కంటే
లంచ్‌లోకి చికెన్ కర్రీనే ఇంపార్టెంటు
ప్రపంచమంతా గగ్గోలు పెడుతున్నా
గోధుమ పిండిపైనే ఫోకసు..
మనమంతే బ్రదర్!
ట్రాఫిక్కు జాములో చిక్కుకుని
చిక్కటి కాలుష్యాన్ని పీల్చుకుని
గంటల కొద్దీ రోడ్డుపైనే కాపురాలు చేసేస్తాం!
ఇంట్లో కూర్చోమంటే మాత్రం
దినదిన గండంలా బతుకుతుంటాం.
మనమంతే బ్రదర్
వాడెంతిచ్చాడు
వీడెంతిచ్చాడు
అని లెక్కలేస్తాం.
అంకెల్లో తేడా వస్తే
దేశభక్తి లేదా అంటూ నిందిస్తాం.
జేబులోంచి మాత్రం చిల్లిగవ్వ తీయం.
మనమంతే బ్రదర్!
చేతులు కడుక్కోవడం
మూతి తుడుచుకోవడం కూడా
మనకు స్టార్లే చెప్పాలి
శుభ్రత పాఠాలు బోధించడానికీ
సెలబ్రెటీలే దిగిరావాలి
మనమంతే బ్రదర్!
దిల్లీ వెళ్లొచ్చినవాడ్ని దేశ ద్రోహిగా చూస్తాం
మనం మాత్రం గల్లీల్లో ఉప్పరు మీటింగులు పెడతాం
ఫేస్ బుక్కులోన ఫేకు న్యూసులే నమ్ముతాం
సిల్లీ వార్తలే సర్క్యులేట్ చేసుకుంటాం.
మనమంతే బ్రదర్!
ఒక్కరోజు లాక్ డౌన్ అంటే
యేడాది సామాన్లు కొనేస్తాం.
తెల్లారేక రేట్లు పెరిగాయని గోల చేస్తాం.
తప్పట్లు కొట్టమంటే
తపేళాలు బద్దలకొట్టేస్తాం..
దీపం వెలిగించంటే దీపావళి చేసేస్తాం
మనమంతే బ్రదర్!