ప్రార్థన చేసే పెదవులు కాదు, ట్వీట్లు చేసే వేళ్లు కాదు, సేవ చేసే చేతులే ఇప్పుడు కావాలి. ప్రపంచం మొత్తం ఇప్పుడు కరోనా దిగ్భంధనంలో ఉంది. ఆకలి కేకలు మిన్నంటుతున్నాయి. ఆకలి చావులు కూడా చూస్తామేమో అన్న భయం వ్యాప్తిస్తోంది. ఇలాంటి సమయంలో కాలుతున్న కడుపులు నింపడానికి చాలామంది ముందుకొస్తున్నారు. మరీ ముఖ్యంగా సెలబ్రెటీలు తమ వంతు సహాయం అందిస్తున్నారు. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకూ స్టార్లు, సూపర్ స్టార్లంతా కరోనాపై పోరాటానికి తమ మద్దతు తెలిపారు. భారీగా విరాళాలు ప్రకటించారు. ఇప్పుడు అమితాబ్ బచ్చన్ మరో అడుగు ముందడుగు వేశారు. ఏకంగా లక్ష కుటుంబాల కడుపు నింపడానికి సిద్ధమయ్యారు.
దేశ వ్యాప్తంగా ఆకలితో అలమటిస్తున్న సినీ కార్మికుల్ని గుర్తించి వాళ్లకు నెలకు సరిపడ నిత్యావసర వస్తువుల్ని అందించాలని బిగ్ బి నిర్ణయించుకున్నారు. హిందీ, తమిళ, తెలుగు, కన్నడ, మలయాళీ… ఇలా భాషతో సంబంధం లేకుండా, సినీ కార్మికులు ఎక్కడున్నా సరే, వాళ్లకు ఈ సహాయం అందుతుంది. అందుకు తగిన పటిష్టమైన ప్రణాళికను కూడా బిగ్ బీ టీమ్ సిద్ధం చేసింది. ఈ విషయంలో బిగ్ బీకి సాంకేతిక సహాయం అందించడానికి కల్యాణీ జ్యూయెలర్స్, సోనీ పిక్చర్స్ సంస్థలు ముందుకు వచ్చాయి.