వైసీపీ తరపున పోటీ చేస్తున్న స్థానిక సంస్థల అభ్యర్థులు, వారి తరపున కొందరు ప్రభుత్వం ఇస్తున్న రూ. వెయ్యి ఆర్థికసాయాన్ని లబ్దిదారులకు అందిస్తూ… ఓట్లు అడుగుతున్న వైనంపై.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వెంటనే స్పందించారు. ఇలా చేయడం.. ఎన్నికల ప్రక్రియ ఉల్లంఘనేని స్పష్టం చేశారు. వైసీపీ స్థానిక సంస్థల అభ్యర్థులతో పాటు.. మరికొంత మంది రూ. వెయ్యి ఇస్తూ.. స్థానిక ఎన్నికల్లో వైసీపీకి ఓట్లు వేయాలని ప్రచారం చేస్తున్నారంటూ… బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ, సీపీఐ నేత రామకృష్ణ ఈసీకి ఫిర్యాదులు చేశారు. ఈ మేరకు కొన్ని వీడియోలు కూడా.. ఆయనకు పంపారు. వీరి ఫిర్యాదులు అందాయని ప్రకటించిన ఎస్ఈసీ రమేష్ కుమార్.. అభ్యర్థుల పేరు మీద ఆర్థిక ప్రయోజనం కల్పించడం.. ఓట్లు అడగడం చట్ట విరుద్ధమేనన్నారు.
ఎన్నికల ప్రచారంపై ప్రస్తుతం నిషేధం ఉందనే సంగతిని గుర్తు చేశారు. ఇలాంటి ఘటనలపై నివేదికలు ఇవ్వాలని.. ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశిస్తామని స్పష్టం చేశారు. క్షేత్ర స్థాయిలో దృష్టి సారించాలని.. కలెక్టర్లు, ఎస్పీలను నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశించారు. డబ్బులు పంచుతున్న ఘటనలు జరగకుండా.. చర్యలు తీసుకోవాలన్నారు. ఏపీలో స్థానిక ఎన్నికల నిర్వహణ వివాదాస్పదంగా మారింది. కరోనా వైరస్ వ్యాప్తిని జాతీయ విపత్తుగా ప్రకటించడంతో.. ఎన్నికల ప్రక్రియను నామినేషన్ల టైంలో.. నిమ్మగడ్డ రమేష్ కుమార్ వాయిదా వేశారు.
దాన్ని తప్పు పట్టిన రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. అయినా ఊరట లభించలేదు. కోడ్ ఎత్తివేసినప్పటికీ.. ఎన్నికల ప్రచారంపై నిషేధం విధించింది. అయితే.. వైసీపీ నేతలు మాత్రం.. వివిధ ప్రభుత్వ కార్యక్రమాలను.. తమ సొంత కార్యక్రమాలుగా భావిస్తూ.. పనులు చేస్తూ.. ఫ్యాన్ గుర్తుకే ఓటేయాలని కోరుతున్నారు. దీనిపై విపక్షాలు తీవ్రమైన విమర్శలు చేస్తున్నాయి. ఆధారాలతో ఎస్ఈసీకి ఫిర్యాదు చేయడంతో ఒక్క రోజులోనే నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్పందించారు. ఎన్నికల ప్రక్రియ మొత్తం రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్న విపక్ష నేతల వాదనకు తాజా పరిణామాలు మరింత బలం చేకూరినట్లయింది.