హైడ్రాక్సీ క్లోరోక్విన్ మందును అమెరికాకు ఎగుమతి చేయకపోతే.. ప్రతీకార చర్యలకు దిగుతామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ … చేసిన హెచ్చరికలకో… పలు దేశాల నుంచి.. ఆ మెడిసిన్స్ కోసం వస్తున్న ఒత్తిడి కారణంగానో కానీ భారత్… హైడ్రాక్సి క్లోరోక్విన్ మందులపై నిషేధం సడలించింది. కోవిడ్ -19 వైరస్‌కి విరుగుడుగా.. భారత్‌లో తయారయ్యే మలేరియా మందులు హైడ్రాక్సీ క్లోరోక్విన్ బాగా పని చేస్తోందని.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గట్టిగా నమ్ముతున్నారు. దీనిపై అమెరికాలోనే భిన్నాభిప్రాయాలున్నా.. కరోనా రోగులకు.. ఇతర మందులతో పాటు క్లోరోక్విన్ ఇస్తే..బాగా ఉపయోగపడుతుందని నమ్ముతున్నారు. భారత్‌లో ఈ మందుల ఉత్పత్తి ఎక్కువగా జరుగుతుంది.
అందుకే… గత వారం.. నేరుగా నరేంద్రమోడీకి ఫోన్ చేసిన ట్రంప్… పెద్ద ఎత్తున మందుల ఎగుమతికి అనుమతి ఇవ్వాలని కోరారు. అయితే.. అదే రోజు భారత్… అనేక రకాల మందుల ఎగుమతులపై నిషేధం విధించింది. ఇందులో హైడ్రాక్సీ క్లోరోక్విన్ కూడా ఉంది. ఈ విషయం తెలిసన డొనాల్డ్ ట్రంప్ … ఒక్క సారిగా ఫైరయ్యారు. హైడ్రాక్సీక్లోరోక్విన్ మాత్రల్ని సరఫరా చేయొద్దన్నదే మోదీ నిర్ణయమైతే.. దానికి ప్రతీకారం ఉండొచ్చు..ఎందుకు ఉండకూడదని వైట్ హౌస్‌లో మీడియా ముందు నేరుగా హెచ్చరించారు. ఇది హైలెట్ అయింది. అదే సమయంలో.. ప్రపంచ దేశాల నుంచి హైడ్రాక్సీక్లోరోక్విన్ ఔషధానికి డిమాండ్ పెరిగింది. ఎగుమతులపై భారత్ విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని ఒత్తిడి చేయడం ప్రారంభించాయి.
చివరికి మానవతా దృక్పథంతో క్లోరోక్విన్ సహా అవసరమైన ఇతర ఔషధాల్ని.. ఆయా దేశాలకు సరఫరా చేస్తామని విదేశాంగ శాఖ ప్రకటన చేసింది. ఉత్పత్తి చేయడానికి ఫార్మా కంపెనీలకు అనుమతి ఇస్తామని ప్రకటించారు. దీంతో సమస్య పరిష్కారం అయినట్లయింది. ప్రస్తుతానికి కొవిడ్-19 చికిత్సకు ఎలాంటి టీకాగానీ, ఔషధంగానీ లేవు. అయితే మలేరియాను నయం చేయడానికి వాడే హైడ్రాక్సీక్లోరోక్విన్ ఆశాజనక ఫలితాలు ఇస్తోందని నమ్ముతున్నారు. అందుకే భారత అవసరాలకు సరిపడిన తర్వాత అదనంగా మరో 25 శాతం నిల్వలను ఉంచుకొని.. మిగిలిన హైడ్రాక్సీక్లోరోక్విన్‌ని ఇతర దేశాలకు సరఫరా చేయాలని కేంద్రం నిర్ణయించింది.