బుధవారం అల్లు అర్జున్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా సుకుమార్ సినిమాకి సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్ విడుదల చేసే ప్రయత్నాల్లో ఉంది చిత్రబృందం. ఇప్పుడు ఆ టైటిల్ కూడా ముందే బయటకు వచ్చేసింది. ఈ చిత్రానికి `పుష్ష` అనే పేరు ఖరారు చేశారని సమాచారం. కుమారి, గంగ అనే మరో రెండు టైటిళ్లు కూడా ఈ సినిమా కోసం పరిశీలించారు. అంతకు ముందు `సింహాచలం` అనుకున్నారు. చివరికి `పుష్ష` ఖాయమైంది. అయితే ఈ టైటిల్ పై స్వయంగా బన్నీ అభిమానులే పెదవి విరుస్తున్నారు. టైటిల్ అంతగా క్యాచీగా లేదని, ఓ పెద్ద హీరో సినిమాకి ఇలాంటి టైటిళ్లు పనికిరావని.. బెంగ పడిపోతున్నారు. సింహాచలం, గంగ పేరులో ఏది సెట్ చేసినా బాగుండేదని చాలామంది అభిప్రాయపడుతున్నారు.
కాకపోతే సుకుమార్ మైండ్ సెట్ వేరు. ఫ్యాన్స్ ఏం ఆలోచిస్తారో, ఎలాంటి అంశాలు కోరుకుంటారో అతనికి బాగా తెలుసు. వాటికి అందిస్తూనే తనదైన ముద్ర వేయడానికి ప్రయత్నిస్తాడు. ఎన్టీఆర్ లాంటి మాస్ హీరోతో సినిమా తీస్తూ… `నాన్నకు ప్రేమతో` లాంటి సాఫ్ట్ టైటిల్ ఎంచుకున్నాడు. `రంగస్తలం` అనే టైటిల్ కూడా వినగానే నచ్చేయలేదు. పోస్టర్, లోగోతో పాటు చూస్తే బాగా సెట్టయ్యింది. `పుష్ష` కూడా అంతే కావొచ్చు. రేపు బన్నీ లుక్తో పాటు, పోస్టర్ చూస్తే.. ఈ అనుమానాలన్నీ తొలగిపోతాయి.