మలయాళ చిత్రం ‘లూసీఫర్’ని రీమేక్ చేయాలన్నది చిరంజీవి ఆలోచన. అయితే ఇప్పటిది కాదు. యేడాది క్రితం మాట ఇది. మోహన్‌లాల్ నటించిన ఈ చిత్రం మలయాళంలో మంచి విజయాన్ని అందుకుంది. గాడ్ ఫాదర్ స్ఫూర్తితో తెరకెక్కించిన సినిమా ఇది. రామ్ చరణ్‌కి బాగా నచ్చింది. చరణ్ ప్రోద్భలంతోనే ఓ నిర్మాత ఈ సినిమా హక్కుల్ని కొన్నాడు. అయితే `లూసీఫర్` డబ్బింగ్ రూపంలోనూ తెలుగులోకి వచ్చింది. అంతగా ఆడలేదు. కానీ చరణ్‌కి ఈ కథపై నమ్మకం ఎక్కువ. అందుకే రైట్స్ కొనిపించాడు. అయితే ఆ తరవాత ఏమైందో.. చిరంజీవి ఈ రీమేక్ ని పక్కన పెట్టేశాడు. దాంతో చరణ్ మాట విని, ఈ రీమేక్ రైట్స్ కొన్న నిర్మాత డీలా పడ్డాడు. ఇప్పుడు ఈ రీమేక్‌పై మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి.
ఇటీవల చిరంజీవి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ‘లూసీఫర్’ రీమేక్ ప్రస్తావన వచ్చింది. ఈ సినిమాని రీమేక్ చేయాలనుకున్నామని, అందుకే రైట్స్ కూడా తీసుకున్నామని వివరించాడు చిరు. కావాలంటే ఈ కథని పవన్ కల్యాణ్‌కి ఇస్తానన్నాడు. దాంతో లూసీఫర్ రీమేక్ మళ్లీ వార్తల్లో నిలిచింది. నిజానికి ఈ సినిమాకి రీమేక్ చేయాలని చరణ్ తెద వెనుక ప్రయత్నాలు మొదలెట్టాడు. కానీ… తెలుగులో ఇలాంటి కథలు సెట్ అవ్వవని భావించి పక్కన పెట్టేశాడు. చరణ్ మాట కాదని చిరు ఈ సినిమా చేసే అవకాశం లేదు. పవన్ ఏమైనా ఆసక్తి చూపిస్తే… ఈ రీమేక్ రైట్స్ కొన్నందుకు న్యాయం జరుగుతుంది. లేదంటే.. లేదంతే!