ప్రధానమంత్రి నరేంద్రమోడీ.. గత వారం.. ప్రతిపక్ష నేతలందరికీ ఫోన్లు చేశారు. కరోనాను ఎదుర్కోవడానికి సూచనలు, సలహాలు ఇవ్వాలని కోరారు. సోనియా గాంధీ ఈ మేరకు.. ప్రధానమంత్రి నరేంద్రమోడీకి సూచనలు, సలహాలు ఇస్తూ ఓ లేఖ రాశారు. ప్రస్తుతం దేశం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. తర్వాత మాంద్యంలోకి జారిపోతుందనే భావన కూడా వ్యక్తమవుతోంది. అందుకే.. కరోనాను కట్టడి చేయడానికి.. దేశ ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చడానికి కొన్ని కీలకమైన సూచనలు సోనియా చేశారు. కొత్త పార్లమెంట్‌ను కట్టాలని కేంద్రం నిర్ణయించుకుంది. సెంట్రల్ విస్టా అని దానికి పేరు పెట్టింది. రూ. 20వేల కోట్లను దాని కోసం కేటాయించింది. ఇప్పుడీ ప్రతిపాదనను విరమించుకుని..ఆ రూ. 20వేల కోట్లను కోవిడ్ -19పై పోరాటానికి వెచ్చించాలని సోనియా సూచించారు. ఆ నిధులతో ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. ప్రస్తుతమున్న చారిత్రక భవనంలో పార్లమెంటు కార్యకలాపాలు ఎలాంటి ఇబ్బంది లేదని గుర్తు చేశారు. అలాగే.. రెండేళ్ల పాటు ప్రభుత్వ ప్రకటనలపై నిషేధం విధించమని మరో సలహా ఇచ్చారు. ఒక్క కరోనాపై చైతన్యానికి సంబంధించిన యాడ్స్ తప్ప మిగిలినవన్నీ నిలిపేయాలన్నారు. ప్రస్తుతం ఏటా రూ. 1250 కోట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటనల కోసం ఖర్చు చేస్తోంది.
ఇక ప్రధాన మంత్రి, కేంద్ర మంత్రులు, సీఎంలు, రాష్ట్రాల మంత్రులు, అధికారుల విదేశీ పర్యటనలు ప్రత్యేక అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే అనుమతించాలని సూచించారు. దీని వల్ల వందల కోట్లు మిగులుతాయన్నారు. ఒక్క ప్రధాని ఖాతా కింద ఏటా విదేశీయానాలకు రూ.400 కోట్ల మేర ఖర్చవుతోందని సోనియా గుర్తు చేశారు. అలాగే.. కరోనా సహాయక చర్యల కోసం ఏర్పాటు చేసిన పీఎం కేర్స్ నిధిలో జమ అయిన మొత్తాన్ని ప్రధాన మంత్రి నేషనల్ రిలీఫ్ ఫండ్‌కు బదిలీ చేయాలని సూచించారు. అందులో ఇప్పటికే ఉన్న రూ. 3800 కోట్లతో ఇప్పుడు వచ్చిన మరికొన్ని వేల కోట్లు కలిపి.. కరోనా పై పోరాటానికి ఉపయోగించవచ్చన్నారు. పారదర్శకత కూడా పెరుగుతుందన్నారు. పీఎం కేర్స్ నిధులను కలిపి అణగారిన. పేదల ఆహార భద్రతకు వినియోగించుకోవచ్చని సోనియా అభిప్రాయపడ్డారు. అదే విధంగా ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు, కేంద్ర ప్రాయోజిత పథకాలు కాకుండా.. ఇతర బడ్జెట్లో 30 శాతం తగ్గించాలని సోనియా సూచించారు.
ఇలా మొత్తం ఆదా అయ్యే రూ. 2.5 లక్షల కోట్లతో వలస కార్మికులు, కార్మికులు, రైతులు, ఇతర అసంఘటిత రంగ కార్మికులు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఆర్థిక భద్రత కల్పించాలని సూచించారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ప్రభుత్వానికి ఆమె సలహాలు ఉపయోగపడేలా ఉన్నాయన్న అభిప్రాయం నిపుణుల్లో ఏర్పడుతోంది. ఇతర విపక్ష నేతలు కూడా.. దాదాపుగా ఇవే సలహాలు ఇస్తున్నారు. మరి ప్రధానమంత్రి నరేంద్రమోడీ.. ఈ విషయంలో ఎలా స్పందిస్తారో వేచి చూడాలి..!