దేశం కాదు.. ప్రపంచం మొత్తం ఇప్పుడు ముట్టడిలో ఉంది. మానవాళినే కష్టాల్లో ఉంది. ప్రపంచ దేశాల పాలకులందరూ.. తమకు చేతనయినంత స్థితిలో ప్రజలకు ధైర్యం ఇస్తున్నారు. కరోనాను అంతం చేస్తామని… భయపడవద్దని భరోసా ఇస్తున్నారు. కానీ.. అన్నింటి కంటే భిన్నంగా.. ఒక్క ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే…ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలందరూ.. ఇంకా చెప్పాలంటే.. డబ్బులున్న పారిశ్రామికవేత్తలు, గెలుపొందిన తర్వాత తన ద్వారా పదవులు పొందిన వారు.. తనకు అండగా ఉండాలని కోరుకుంటున్నారు. అదీ కూడా.. మాటలతో కాదు తనకు చెందిన సాక్షి పత్రికలో ఫుల్ పేజీ ప్రకటనలు ఇవ్వడం ద్వారా అండగా ఉండాలని కోరుతున్నారు.
సీఎంకు అండగా ఉండాలంటూ మంత్రుల ఫుల్ పేజీ ప్రకటనలు..!
సాక్షి దినపత్రిలో కొద్ది రోజలుగా వరుసగా ప్రకటనలు వస్తున్నాయి. చిన్న చిన్న ప్రకటనలు కాదు. ఫుల్ పేజీ ప్రకటనలు. ఫ్రంట్ పేజీతో మరో పేజీ నిండా ప్రకటన ఉంటుంది. మొదటగా.. లలితా జ్యూయలర్స్ యజమాని ఈ తరహా ప్రకటన ఇచ్చారు. ముఖ్యమంంత్రిగారికి అండగా ఉందాం అంటూ.. ఆయన .. కొన్ని కోట్ల రూపాయలతో ప్రకటన ఇచ్చి.. అండగా ఉంటానని చేతలతో చూపించారు. అది ప్రైవేటు యాడ్. అంతటితో అయిపోలేదు.. తర్వాత.. అదే ప్రకటనను.. కిరణ్ కుమార్ ఫోటో స్థానంలో మంత్రులను చేర్చి.. ప్రకటనలు రావడం ప్రారంభమయింది. మొదట జగన్ బంధువు, మంత్రి అయిన బాలినేని శ్రీనివాసరెడ్డి.. ముఖ్యమంత్రికి అండగా ఉందాం అంటూ ప్రకటన విడుదల చేశారు. ఇప్పుడు మరో మంత్రి ఆదిమూలపు సురేష్ ఆ బాధ్యత తీసుకున్నారు. ముఖ్యమంత్రిగారికి అండగా ఉందామంటూ కృతజ్ఞత చాటు కున్నారు.
ప్రభుత్వ సొమ్ము రూ. కోట్లు సాక్షికి ఆ రూపంలో తరలిస్తున్నారా..?
లలితా జ్యూయర్స్ యజమాని ఇచ్చిన ప్రకటన ఖచ్చితంగా వ్యక్తిగతమే. అందులో అసందేహం లేదు. సేమ్ టు సేమ్ డిజైన్‌ను మంత్రులు వాడుతున్నారు. మంత్రి హోదాలో ప్రకటనలు ఇస్తున్నారు. అయితే..ఇది వ్యక్తిగతమా.. లేకపోతే.. తమ శాఖల తరపున ఇస్తున్నారా అన్న విషయాన్ని మాత్రం గోప్యంగా ఉంచుతున్నారు. సాధారణంగా ప్రకటనలు సమాచార, పౌర సంబంధాల శాఖ జారీ చేయాలి. ఇక్కడ ప్రకటనల కింద అలాంటివేమీ లేవు. అంటే.. ఐ అండ్ పీఆర్ ద్వారా ఆ ప్రకటనలు రాలేదు. అలాగని.. అవి వ్యక్తిగత ప్రకటనలా అంటే.. చెప్పడం కష్టం. తమ శాఖల తరపున ఆ ప్రకటనలు ఇవ్వడానికి అవకాశం ఉంది. వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి గారికి అండగా ఉండాలని ప్రకటన ఇవ్వదల్చుకుంటే.. ఎంత లేదన్నా .. కనీసం.. రూ. 50 లక్షల నుంచి రూ. కోటి వరకూ ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అంత మొత్తం .. సాక్షికి చెల్లించుకుని.. ముఖ్యమంత్రికి అండగా ఉండాలని ప్రకటనలిస్తారా అన్నది అసలు విషయం. లాక్ డౌన్ కారణంగా అన్ని పత్రికల్లాగే సాక్షి కూడా ఆదాయ సంక్షోభంలో పడింది. నిర్వహణ ఖర్చుల కోసం.. ఇలా ప్రకటనల రూపంలో డబ్బులు ప్రభుత్వ ఖజానా నుంచి తరలిస్తున్నారేమోనన్న సందేహం.. సహజంగానే చాలా మందిలో వస్తోంది.
సీఎమ్‌కే అండ కావాల్సి వస్తే ఇక ప్రజలకు భరోసా ఇచ్చేదెవరు..?
పాలకుడన్న తర్వాత ఎవరైనా ప్రజలకు అండగా ఉండాలి. ఎలాంటి సందర్భంలో అయినా వారితో ఉండి.. ధైర్యం చెప్పాలి. కానీ ఇక్కడ ముఖ్యమంత్రికే అండగా ఉండాలని ప్రజలకు మంత్రులు పిలుపునిస్తున్నారు. ప్రజలు .. ఉపాధి కోల్పోయి నానా ఇబ్బందులు పడుతున్నారు. పది నెలల నుంచి ప్రభుత్వ నిర్ణయాల వల్ల ఏపీలో ఆర్థిక కార్యకలాపాలు పూర్తిగా మందగించాయి. ఇసుక దగ్గర్నుంచి వారిని ఏదో ఓ సమస్య వెంటాడుతూనే ఉంది. ఇలాంటి సమయాల్లో ప్రభుత్వం తమకు అండగా ఉండాలని ప్రజలు కోరుకుంటారు. దానికి భిన్నంగా ముఖ్యమంత్రి వ్యవహారశైలి ఉంది. ముఖ్యమంత్రి గత పది నెలల్లో ప్రజల్లోకి వచ్చిన సందర్భమే కరోనా వచ్చిందని సమీక్షలు చేస్తున్నారు కానీ.. క్షేత్ర స్థాయిలో చేసిందేమీ లేదు. కానీ తనకు అండగా ఉండాలంటూ.. మంత్రులతో ప్రకటనలు ఇప్పించేస్తున్నారు.