కృష్ణ… ఓ సూపర్ స్టార్. మృధు స్వధావి, సాత్వికుడు, అజాత శత్రువు. ఇలా ఆయన గురించి ఎన్ని ఉపమానాలైనా ఇచ్చుకోవొచ్చు. నిజాన్నినిర్భయంగా ఒప్పుకోవడంలో, తనమీద తనే సెటైర్లు వేసుకోవడంలో కృష్ణని మించినవాళ్లు లేరు. సొంత డబ్బా- పర డబ్బా- పరస్పర డబ్బా అనేది కృష్ణ దగ్గర అస్సలు కుదరదు. ‘మీ సినిమా టాక్ బాగుందంటండీ… హిట్టు గ్యారెంటీ’ అంటూ ఎవరైనా మునగచెట్టు ఎక్కించాలని ప్రయత్నిస్తే.. ‘అంతలేదు. సినిమా ఫ్లాపు. రెండోవారానికి ఎత్తేస్తారు’ అని వాస్తవాన్ని కళ్లముందుకు తీసుకొచ్చేవారు కృష్ణ. అందుకే కృష్ణ దగ్గరకు పక్కా రిజల్టే వెళ్లేది. ఆయన చెప్పేదే పక్కా అయ్యేది. ముందు నుంచీ కృష్ణ మనస్తత్వమే అంత. అందుకు ఓ మంచి ఉదాఃహరణ ఇది.
అది 1982. కృష్ణావతారం షూటింగ్ జరుగుతోంది. బాపు దర్శకుడు. సెట్లో కృష్ణకు ఓ సన్నివేశం వివరించారు బాపు. ‘యాక్షన్..’ కూడా చెప్పారు. కృష్ణ నటించారు. కానీ.. అది బాపుకి నచ్చలేదు. ‘వన్ మోర్’ అన్నారు. మళ్లీ ఆ షాట్ తీశారు. మళ్లీ బాపుకి నచ్చలేదు. బాపు మరోసారి `వన్ మెర్` అన్నారు. మళ్లీ తీశారు. మళ్లీ నచ్చలేదు. ఇలా రీటేకుల మీద రీటేకులు తీసుకుంటూ వెళ్లారు. అటు బాపుకీ, ఇటు కృష్ణకీ ఇద్దరికీ విసుగొచ్చేసింది. కొంతసేపయ్యాక షాట్ లోంచి బయటకు వెళ్లిపోయారు కృష్ణ. ఆ పక్కనే ఉన్న ముళ్లపూడి వెంకట రమణ దగ్గర కూర్చుని “బాపు గారేంటండీ.. టేకుల మీద టేకులు తీసుకుంటున్నారు. `సాక్షి` తీసి ఇప్పటికి 15 ఏళ్లయ్యాయి. నాకేదో అనుభవం వచ్చేసింది, అప్పటి కంటే బాగా చేయలగలనని అనుకుంటున్నారేమో ఆయన. నా నటన ఇంతే. ఇన్ని సార్లు రీటేకులు తీసుకున్నా ఇంతే. ఇంతకంటే బాగా నటించలేదు. ఆయన మొదటిసారి తీసిన టేకే ఓకే చేసుకోమనండి. ఎందుకంటే… మిగిలిన టేకుల్లోనూ నేను అలానే నటించాను. ఏమాత్రం మార్పులేదు” అన్నార్ట. కృష్ణ అప్పటికే ఓ సూపర్ స్టార్. ఆయన మాట విని నివ్వెరపోయార్ట ముళ్లపూడి. ‘కోతికొమ్మచ్చి’లో ఈ ఉదంతాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. అదీ.. కృష్ణ అంటే.