వైరస్ టెస్ట్ కిట్లను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా.. దేశం దృష్టిని తన వైపు తిప్పుకుంది విశాఖ మెడ్‌టెక్ జోన్. సాధారణంగా ఏపీలో పొలిటికల్ క్రెడిట్ గేమ్స్ చాలా ఎక్కువ. ఇలాంటి ఓ అరుదైన విజయాన్ని క్లెయిమ్ చేసుకోకుండా ఎలా ఉంటారు. వెంటనే వైసీపీ నేతలు…వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందు చూపు కారణంగా.. విశాఖ మెడ్‌టెక్ జోన్ నుంచి కరోనా కిట్లు తయారయి బయటకు వచ్చాయని.. ప్రకటించుకున్నారు. ఆ ముందు చూపేమిటో ఎవరికీ తెలియదు. మెడ్‌టెక్ జోన్ అభివృద్ధి కోసం పది నెలల్లో ఏం చేశారో ఎవరికీ తెలియదు. కానీ.. దానికి వ్యతిరేకంగా చేసినవి మాత్రం కళ్ల ముందు కనిపిస్తూనే ఉన్నాయి.
నరేంద్రమోడీ మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి గతంలో పిలుపునిచ్చారు. ఆ సమయంలో.. ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు భవిష్యత్‌లో మెడికల్ టెక్నాలజీకి ఎంతో స్కోప్ ఉందని గుర్తించి.. విశాఖలో మెడ్‌టెక్ జోన్‌కు రూప కల్పన చేశారు. సైంటిస్ట్‌గా ఎంతో అనుభవం ఉన్న జితేందర్ శర్మ అనే ఆయనను.. సీఈవోగా నియమించారు. జితేందర్ శర్మ ప్రపంచ ప్రఖ్యాత మెడికల్ ఎక్విప్మెంట్ పరిశ్రమలన్నీ .. ప్లాంట్లు పెట్టేలా కృషి చేశారు. ఆయన కృషి ఫలితంగా.. పెద్ద ఎత్తున పరిశ్రమలు వచ్చాయి. ఇప్పుడు ఆ ప్రతిఫలం కనిపిస్తోంది. ఈ మెడ్టెక్జోన్పై పది నెలల్లో జరిగిన రాజకీయం అంతా ఇంతా కాదు. చంద్రబాబు ఓడిపోగానే.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు హయాంలో జరిగిన కార్యక్రమాలన్నింటిపై కన్నేసినట్లుగానే..మెడ్‌టెక్ జోన్ పైనా కన్నేశారు. పలు రకాల విచారణలకు ఆదేశించారు. అక్కడ ఏం తేలిందో కానీ.. అదొక మయసభ అని మీడియాకు లీక్ చేశారు. కొన్ని వందల కోట్లు స్కాం జరిగిందనట్లుగా చెప్పుకొచ్చారు. ఈ ఆరోపణలు మీడియాకు లీక్ చేసేసి.. సీఈవో జితేందర్ శర్మను.. తొలగించేశారు. మెడ్‌టెక్ జోన్లో రెండో దశ విస్తరణ కోసం కేటాయించాల్సిన నిధుల్లో 90 శాతం కత్తిరించేశారు.
అయితే.. అంతర్జాతీయంగా.. ఏపీ వ్యవహారం కలకలం రేపింది. మెడ్‌టెక్‌జోన్‌లో ప్లాంట్లు పెట్టిన.. పెట్టాలనుకున్న మెడికల్ కంపెనీలన్నీ నేరుగా ప్రధానమంత్రికి ఫిర్యాదు చేశాయి. పెట్టుబడులు పెట్టిన విదేశీ కంపెనీలు కూడా.. కేంద్రానికి ఈ వ్యవహారంపై లేఖలు రాశాయి. పెట్టుబడిదారుల నమ్మకాన్ని దెబ్బతీయవద్దని కోరాయి. కేంద్రం… హెచ్చరికలు జారీ చేయడంతో.. మళ్లీ మెడ్‌టెక్ జోన్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓగా నియమిస్తూ జనవరి 30వ తేదీన ఉత్తర్వులు జారీ చేశారు. ఇంతగా.. ప్రభుత్వం మెడ్‌టెక్ జోన్‌పై పది నెలల్లో ప్రతీకార చర్యలకు దిగింది. అయినప్పటికీ.. ఈ రోజు వైరస్ టెస్ట్ కిట్స్ ను రిలీజ్ చేయడంతో తమ ఘనతగా చెప్పుకునేందుకు ప్రభుత్వం వెనుకాడటం లేదు. కొసమెరుపేమిటంటే.. ఇప్పటికే.. మెడ్‌టెక్ జోన్లో ప్లాంట్లు పెట్టిన కొన్ని కంపెనీలు… కొన్ని నెలల వ్యవధిలోనే వేరే రాష్ట్రాలకు వెళ్లిపోయాయి.