బిఫోర్ కరోనా – ఆఫ్టర్ కరోనా అని విడదీసుకుని చూసుకోబోతున్నామేమో..? పరిస్థితులు అలానే కనిపిస్తున్నాయి. ఎందుకు పుట్టిందో తెలీదు గానీ, ఈ మహమ్మారి వ్యవస్థలన్నింటినీ తలకిందులు చేసేసింది. మనిషి మనుగడకే ప్రశ్నార్థకంగా మారింది. రేపో మాపో కరోనా వెళ్లిపోవొచ్చు. కరోనా ఫ్రీ దేశాన్నీ, కరోనా లేని ప్రపంచాన్నీ చూసే భాగ్యం కలగొచ్చు. కానీ.. కరోనా ఇచ్చిన షాక్ నుంచి తేరుకోవడానికి ఈ ప్రపంచానికి మరో పదేళ్లు పట్టినా ఆశ్చర్యం లేదు. ప్రపంచంలో ఎంతటి విధ్వంసం తలెత్తినా, చిత్రసీమకు ఆ ఎఫెక్ట్ అంతంత మత్రంగానే ఉండేది. అందరికంటే ముందు సినిమానే తేరుకునేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేదు. కరోనా వల్ల అత్యంత డీలా పడిపోయిన రంగాల్లో సినిమా కూడా చేరబోతుందన్నది అక్షర సత్యం.
* లాక్ డౌన్ ఎత్తేసినా ప్రేక్షకులు సినిమా థియేటర్లకు రావడానికి జంకుతారు. ఇది వరకటిలా హోస్‌ఫుల్ బోర్డులు చూడడం కష్టమే. జనం గుమ్మిగూడి ఉండడాన్ని ప్రభుత్వం కొంతకాలం నిషేధించినా ఆశ్చర్యం లేదు. దాంతో సినిమా హాళ్లూ, షాపింగ్ మాళ్లూ బంద్ అవుతాయి.
* కరోనా వల్ల అత్యంత ప్రభావవంతమయ్యేది ఫారెన్ షూటింగ్. ఇప్పటి వరకూ చిన్న, పెద్దా అని తేడా లేకుండా ప్రతీ సినిమాకీ కనీసం ఓ షెడ్యూల్, లేదంటే ఓ పాట.. కోసం ఫారెన్ వెళ్లేవారు. బ్యాంకాక్, థాయ్‌లాండ్, మలేసియా అయితే… మన పక్కూరే అన్నట్టు ఉండేది వ్యవహారం. ఇక మీదట ఫారెన్ లో షూటింగ్ అంటే సినిమా వాళ్లు భయపడే అవకాశం ఉంది. అనుమతులు కూడా అంత తేలిగ్గా దొరకవు. ఇదివరకటిలా ఫారెన్ లో చట్టాపట్టాలేసుకుని షూటింగ్ చేసుకునే రోజులు మళ్లీ కనిపించే అవకాశం లేదు.
* లాక్ డౌన్ వల్ల ప్రజలు ఇంటికే పరిమితం అయ్యారు. నెట్ ఫ్లిక్స్,అమేజాన్ లాంటి ఓటీటీ వేదికల వాడకం పెరిగింది. అందులో ఉన్న సౌలభ్యాలు, సౌఖ్యాలు అర్థమవుతున్నాయి. ఒక్కసారి వీటికి అలవాటు పడితే.. జనాలు థియేటర్‌కి రావడం కష్టం అవుతుంది. ఇప్పటికే ఓటీటీ వల్ల చిత్రరంగం చాలా నష్టపోయింది. భవిష్యత్తులో థియేటర్ల ఆక్యుపెన్సీపై ఓటీటీ వేదికలు మరింత ప్రభావం చూపించే అవకాశం ఉంది.
* కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గించడం ఎలాగో… చిత్రసీమ ఆలోచించాల్సిన సమయం ఇది. బడ్జెట్లూ, పారితోషికాలు ఇప్పుడు దిగిరాక తప్పదు. లాక్ డౌన్ తరవాత.. సినిమా పరిశ్రమ మళ్లీ ట్రాక్ ఎక్కితే, విదేశీ నటుల్ని దిగుమతి చేసుకునే ఛాన్సులు చాలా తక్కువ ఉన్నాయి. పరాయి రాష్ట్రంలోంచి నటీనటులకూ అవకాశాలు అంతంత మాత్రంగానే దక్కవచ్చు. స్థానిక నటీనటుల్ని, సాంకేతిక నిపుణుల్ని ఎంచుకోవాలనే చర్చ, నిబంధన మరోసారి తెరపైకి రావొచ్చు.
* థియేటర్ల సంఖ్య తగ్గినా, ఉన్న థియేటర్లు కల్యాణ మండపాలుగా మారినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. భవిష్యత్తులో సినిమాల్ని నేరుగా ఓటీటీ ఫ్లాట్ ఫామ్‌పై విడుదల చేసే అవకాశాన్ని (ముఖ్యంగా చిన్న సినిమాలు) ఏమాత్రం కొట్టి పారేయలేం.
* భారీ బడ్జెట్ చిత్రాలు (ఉదాహరణ ఆర్.ఆర్.ఆర్) ఇక మీదట రూపొందడం కష్టమే. కనీసం కొంతకాలం పాటైనా ఇలాంటి ఆలోచనల్ని చిత్రసీమ వాయిదా వేయడం ఖాయంగా కనిపిస్తోంది.