వైరస్‌పై పోరాటానికి ఆర్థికంగా నిధులు సమీకరించుకునే ఐడియాలను.. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ .. ప్రధానమంత్రి నరేంద్రమోడీకి పంపారు. దానిపై కేంద్రం స్పందన ఏమిటో ఇంకా తెలియదు కానీ.. ఓ ఐడియాపై మాత్రం… జాతీయ మీడియా గుర్రుమంటోంది. అలాంటి ఐడియా ఇవ్వడం కరెక్ట్ కాదని వాదిస్తోంది. సోనియా ఇచ్చిన ఐడియా ఏమిటంటే..వైరస్‌పై అవగాహన ప్రకటనలు తప్ప… ఏ ఇతర ప్రకటనలు కూడా.. మీడియాకు ఇవ్వవద్దని.. ఇలా చేయడం వల్ల కొన్ని వేల కోట్ల ప్రజాధనం మిగులుతుందని.. ఆ మొత్తాన్ని కరోనాపై పోరాటానికి వినియోగించవచ్చని సూచించారు.
ఇది … జాతీయ మీడియా గుండెల్లో రైళ్లు పరుగెత్తించేలా చేసింది. ప్రభుత్వం ప్రకటనలు నిలిపివేస్తే.. తాము మనుగడ సాగించడం కష్టమవుతుందనే ఆందోళన వ్యక్తం చేస్తూ… ది ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ సోనియా గాంధీకి లేఖ రాశారు. సోనియా గాంధీ .. ఆర్థిక సెన్సార్షిప్ను విధించమని.. కేంద్రానికి సలహా ఇచ్చారని.. ఈ సలహాను వెనక్కితీసుకోవాలని కోరారు. ప్రతి మూల నుంచి సరైన సమాచారాన్ని సేకరించి, చేరవేయడానికి సరైన వేదిక ప్రింట్ మీడియానేనని. మాంద్యం, డిజిటల్ ప్లాట్‌ఫాం కారణంగా ఇప్పటికే ఆదాయం చాలా కోల్పోతున్నామని న్యూస్ పేపర్స్ అసోసియేషన్ చెప్పుకొచ్చింది.
లాక్డౌన్ కారణంగా దినపత్రికలు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోయిందని.. గుర్తు చేసింది. సోనియా గాంధీ సలహాపై.. ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ స్పందించలేదు. అయితే.. ప్రభుత్వం ఖర్చు పెట్టే అత్యధిక శాతం నిధులు దినపత్రికలకే వెళ్తాయి. ప్రస్తుతం.. దినపత్రికులు దేశవ్యాప్తంగా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. సోనియా సలహాలను అనుసరించాలని కేంద్రం నిర్ణయిస్తే మాత్రం.. మరిన్ని ఇబ్బందుల్లో పడతాయి. అందుకే ఆందోళన చెంది.. ఆ సలహాను ఉపసంహరించుకోవాలని కోరారు.