డాన్సర్ గా, నటుడిగా, దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు లారెన్స్. ప్రజా సేవలోనూ ముందుంటాడు. ఓ చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి వికలాంగులకు సహాయం చేస్తున్నాడు. ఇప్పుడు కరోనాపై పోరాటంలో తన వంతు సాయం అందించడానికి ముందుకొచ్చాడు. ఏకంగా 3 కోట్లు విరాళం ప్రకటించాడు. తమిళనాడు ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.50 లక్షలు, ప్రధానమంత్రి సహాయనిధికి మరో 50 లక్షలు ఇచ్చాడు. ఈ మూడు కోట్లలో 25 లక్షలు డాన్సర్ అసోసియేషన్‌కి, మరో 75 లక్షల్ని తన సొంత ఊరిలో నిరు పేదల కోసం ఖర్చు చేయనున్నాడు.
పి. వాసు దర్శకత్వంలో చంద్రముఖి 2 సినిమా తెరకెక్కుతోంది. సన్ పిక్చర్స్ ఈ సినిమాని నిర్మించనుంది. ఈ సినిమాలో లారెన్స్ కథానాయకుడిగా నటిస్తున్నాడు. ఈ సినిమా కోసం అందుకున్న రూ.3 కోట్ల అడ్వాన్స్‌లో ఒక్క రూపాయి కూడా తన ఖాతాలో వేసుకోకుండా.. కరోనా పై పోరాటానికి ఖర్చు చేయాలన్న నిర్ణయం తీసుకున్నాడు. నిజంగా లారెన్స్ సాయం అపూర్వం అనే చెప్పాలి. అక్కడ సూపర్ స్టార్లుగా పేరుందిన వాళ్లంతా కోటి రూపాయలకే పరిమితం అయితే.. లారెన్స్ ఏకంగా 3 కోట్లు అందించి తాను సమ్ థింగ్ స్పెషల్ అని చాటుకున్నాడు.