కరోనా మహమ్మారి ఉద్యోగాల్ని మింగేస్తోంది. జీతాలకూ కోత విధిస్తోంది. ఇప్పటికే లక్షల జీవితాలు రోడ్డున పడ్డాయి. ఇంకా పడబోతున్నాయి. ఐటీ తో పాటు దాదాపు అన్ని రంగాల్లోనూ ఉద్యోగార్థులకు గండమే. జర్నలిస్టులూ అతీతం కాదు. మీడియాపై కరోనా పెను ప్రభావం చూపిస్తోంది. యాజమాన్యాలు జీతాల్ని భరించడం ఎలా? అనే లెక్కలు వేసుకోవడంలో తలమునకలయ్యాయి. ఇప్పటికే `హిట్ ` లిస్టు సిద్ధం చేసేసుకున్నాయి. త్వరలోనే దాదాపు 20 శాతం ఉద్యోగాలు ఊడిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పుడు జీతాలూ `కట్` అయ్యే పరిస్థితి. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, ఆంధ్రజ్యోతిలో పని చేస్తున్న ఉద్యోగులకు 20 శాతం వేతనాలు కట్ అయ్యాయని తెలుస్తోంది. అయితే అందరికా, లేదంటే కొంతమందికా అనేది ఇంకా తేలలేదు. కాకపోతే కరోనా ప్రభావం ఉన్నంత వరకూ ఈ కటింగులని, పరిస్థితులు చక్కబడిన తరవాత యధావిధిగా జీతాలు కొనసాగించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ సమయంలో కేవలం ఇళ్లకే పరిమితమైన వాళ్లకు అసలు జీతాలు ఇవ్వట్లేదని తేలింది. నాన్ ఎడిటోరియల్ స్టాఫ్కీ, హెచ్ ఆర్ ఉద్యోగులకూ ఈ నెల జీతాలు అందలేదు. ఆంధ్రజ్యోతి అనే కాదు.. దాదాపు మీడియాలోని అన్ని సంస్థలదీ ఇదే పరిస్థితి. వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్నవాళ్లకు, ఆఫీసుకు వస్తున్నవాళ్లకూ జీతాలు ఇస్తున్నార్ట. మరి మా పరిస్థితి ఏమిటని? నాన్ ఎడిటోరియల్ ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. పరిస్థితి చూస్తుంటే కొన్ని సంస్థలు, ఛానళ్లూ ఈ నష్టాలు భరించలేక.. తాళాలు వేసుకోవాల్సిన పరిణామాలు కనిపిస్తున్నాయి. ఎన్నాళ్ల నుంచో నష్టాలు భరిస్తున్న కొన్ని ఛానళ్లు.. కరోనా ధాటికి తట్టుకోలేక.. శాశ్వతంగా మూసేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.