మాస్కులు ఇవ్వడం లేదని ప్రశ్నించినందుకు నర్సీపట్నంలో ఓ డాక్టర్ను సస్పెండ్ చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. అదే తరహా విమర్శలు చేసిన నగరి మున్సిపల్ కమిషనర్ వెంకట్రామిరెడ్డిని కూడా సస్పెండ్ చేసి పడేసింది. ప్రభుత్వంపై విమర్శలు చేస్తే సహించేది లేదని తేల్చేసింది. నగరి మున్సిపల్ కమిషనర్ … ప్రభుత్వం ఒక్క రూపాయి నిధులు ఇవ్వడం లేదని.. గ్లౌజులు, బూట్లు లాంటివి కూడా కేటాయించడం లేదని.. మున్సిపల్ ఖాతాలన్నింటినీ బ్లాక్ చేసేశారని.. విమర్శిస్తూ.. ఓ వీడియో విడుదల చేశారు.
ఆ వీడియోలో.. నగరి వైసీపీ ఎమ్మెల్యే రోజాను వెంకట్రామిరెడ్డి పొడిగారు. వైసీపీ ఎమ్మెల్యే సొంత డబ్బులు పెడుతూ ఆదుకుంటున్నారని.. ప్రభుత్వం మాత్రం పైసా ఇవ్వడం లేదని.. విమర్శిస్తూ.. ఆ వీడియో విడుదల చేశారు. నగరిలో నాలుగు వైరస్ పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. అక్కడ ప్రజలకు కనీస సౌకర్యాలు… వైరస్ రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడానికి ప్రభుత్వం పైసా కూడా ఇవ్వలేదు. ఏమైనా ఖర్చు చేస్తారేమోనని.. మున్సిపల్ ఖాతాలన్నింటినీ బ్లాక్ చేసేశారని వెంకట్రామిరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు కొందరు స్వార్థం కోసం నాలుగు మాస్క్లు ఇచ్చి పబ్లిసిటీ చేసుకుంటున్నారని వాపోయారు. వెంకట్రామిరెడ్డి వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో.. సస్పెండ్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
కేంద్రం…వైరస్ పై పోరాటానికి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసింది. స్థానిక సంస్థల ఎన్నికలు జరగకపోయినా.. పధ్నాలుగో ఆర్థిక సంఘం నిధులు ఇచ్చింది. అయితే.. వాటిని ప్రభుత్వం వాడుకోనియడం లేదు. ప్రభుత్వం ప్రజారోగ్యం విషయంలో… ఆషామాషీగా ఉంటోందని వస్తున్న విమర్శల తరుణంలో.. ఇలాంటి ఆరోపణలు.. ప్రభుత్వ ఉద్యోగుల నుంచే పెరిగిపోతూండటం… అధికార పార్టీని సైతం కలవరపెడుతోంది. సస్పెండ్ చేసేస్తే.. ఇతరులు నోరెత్తకుండా ఉంటారని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి… కానీ.. తిరగబడతారేమోనన్న ఆందోళన కూడా ఉద్యోగుల్లో ఉందంటున్నారు.