ఆంధ్రప్రదేశ్లో వైద్య , ఆరోగ్య, పారిశుద్ధ్య సిబ్బంది అద్భుతంగా పని చేస్తున్నారని .. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రశంసల వర్షం కురిపించారు. వైద్యులు, నర్సులు, పారామెడికల్, పారిశుద్ధ్య సిబ్బంది హృదయపూర్వకంగా సేవలందిస్తున్నారు. రిస్క్ ఉంటుందని తెలిసీ చాలా కష్టపడి పనిచేస్తున్నారు. భయం ఉన్నా వైద్య సేవలు అందిస్తున్నందుకు సెల్యూట్ చేస్తున్నానని ప్రకటించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ వైద్య, పారిశుద్ధ్య సిబ్బందికి ప్రోత్సాహకాలు ప్రకటించారు. వైద్య సిబ్బందికి పది శాతం సీఎం గిఫ్ట్.. మిగిలిన పారిశుద్ధ్య సిబ్బందికి నగదు ప్రోత్సాహం ప్రకటించారు. దీంతో ఏపీ సీఎం కూడా.. అలాంటి ప్రోత్సాహకం ప్రకటిస్తారేమోనని అందరూ అనుకున్నారు.
అయితే.. జగన్ ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోలేదు. కేవలం.. పొగడ్తలతోనే సరి పెట్టారు. నిజానికి వారి జీతాల్లోనూ మొదట్లో కోత పెట్టింది. సగం మాత్రమే ఇవ్వాలని నిర్ణయించుకుంది. తెలంగాణ సీఎం కేసీఆర్… తర్వాత వారికి పూర్తి జీతాలివ్వాలని నిర్ణయించుకోవడంతో జగన్ కూడా అదే నిర్ణయం తీసుకున్నారు. కానీ ప్రోత్సాహకం ఇవ్వాలనే విషయాన్ని మాత్రం.. కేసీఆర్ ను అనుసరించలేదు. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం.. ప్రైవేటు ఆస్పత్రులను కూడా.. ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది.
కరోనా చికిత్స కోసం ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ ఏర్పాట్లు చేస్తోంది. ప్రైవేటు వైద్యులకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో డ్యూటీలు వేస్తున్నారు. ప్రభుత్వ వైద్యులు.. తీవ్ర ఒత్తిడిలోనూ విధులు నిర్వహిస్తున్నారు. వారు అద్భుతంగా పని చేస్తున్నారన్న సానుభూతి అందరిలోనూ కనిపిస్తోంది. అదే సమయంలో.. వారికి పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్ మెంట్లు అందకపోవడం వివాదాస్పదమయింది.