ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ రమేష్‌కుమార్‌ను తొలగించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓ ఆర్డినెన్స్ ను సిద్ధం చేసి గవర్నర్‌కు పంపిందనే సమాచారం కలకలం రేపుతోంది. ఇందులో.. ఎస్ఈసీ పదవీ కాలం మూడేళ్లకు పరిమితం చేస్తూ.. హైకోర్టు జడ్జి స్థాయి వ్యక్తిని నియమించాలనే ప్రతిపాదన ఉన్నట్లుగా చెబుతున్నారు. కరోనాను జాతీయ విపత్తుగా కేంద్రం ప్రకటించడంతో.. ఎన్నికల నిర్వహణను రమేష్ కుమార్ వాయిదా వేశారు. దీనిపై కులపరమైన దూషణలకు ముఖ్యమంత్రి నుంచి అధికార పార్టీ నేతలందరూ పాల్పడ్డారు. ఆ తర్వాత తనకు ప్రాణభయం ఉందని రమేష్ కుమార్ కేంద్రానికి లేఖ రాశారు. ఆయనకు కేంద్ర ప్రభుత్వం సెక్యూరిటీ కల్పించింది.
ఇటీవల ప్రభుత్వ సాయాన్ని వైసీపీ నేతలు పంచుతూండటంపై ఇతర పార్టీలు చేసిన ఫిర్యాదుల మేరకు.. కలెక్టర్ల నుంచి వివరణ కూడా కోరారు. ఈ సమయంలో.. ఆయనను తొలగించాల్సిదేనని పట్టుదలతో జగన్ ఉన్నట్లుగా చెబుతున్నారు. ఆ మేరకు ఆర్డినెన్స్ రెడీ చేశారని అంటున్నారు. ఆర్డినెన్స్‌ను గవర్నర్ ఆమోదిస్తేనే రమేష్ కుమార్ పదవికి గండం రాదని నిపుణులు చెబుతున్నారు. కొత్త నియామక అర్హతలపై ఆర్డినెన్స్ ఇచ్చిన తర్వాత దాన్ని బిల్లు రూపంలో తీసుకు రావాల్సి ఉంటుంది ఆ బిల్లును అసెంబ్లీలో మూడింట రెండు వందల మెజార్టీతో ఆమోదించాల్సి ఉంటుంది. ప్రస్తుతం వైసీపీకి అంతకు మించి మెజార్టీ ఉంది కాబట్టి.. ఆ బలంతో బిల్లును ఆమోదించుకోవచ్చు. అంతటితో పని అయిపోదు. కేంద్రం ఆమోదించి.. ఆ మేరకు నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉంటుంది.
అప్పుడు మాత్రమే.. ఆ బిల్లు అమల్లోకి వస్తుంది. ఆ తర్వాతనే రమేష్‌కుమార్ ను తొలగించి.. తమకు కావాల్సిన వారిని నియమించుకునే అవకాశం ఉందంటున్నారు. ఇప్పటికే.. సీఆర్డీఏ రద్దు బిల్లు, మూడు రాజధాలను బిల్లులను అడ్డుకున్నారంటూ.. ఏకంగా శాసనమండలినే రద్దు చేసేందుకు తీర్మానం చేసిన ఏపీ సీఎం.. ఇప్పుడు.. కరోనా వచ్చినా ఎన్నికలు నిర్వహించలేదన్న కారణంగా.. స్టేట్ ఎలక్షన్ కమిషనర్‌పైనే గురి పెట్టారు. ఏపీ సీఎం తీరు రాజకీయవర్గాలను సైతం .. విస్మయానికి గురి చేస్తోంది. రాజ్యాంగ వ్యవస్థల అధికారాలను కూడా తానే తీసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.