టాలీవుడ్ ని నడిపిస్తున్న పెద్ద దిక్కుల్లో ప్రొడ్యూసర్ గిల్డ్ కూడా ఒకటి. కొంతమంది అగ్ర నిర్మాతలంతా కలిసి ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ ఇది. కొత్త సినిమాల విడుదల తేదీకి సంబంధించిన ఇష్యూ దగ్గర నుంచి పబ్లిసిటీ విషయాల వరకూ అన్నీ గిల్డే చక్కబెడుతోంది. లాక్ డౌన్ నేపథ్యంలో శనివారం గిల్డ్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేయనుంది. వీడియో కాన్ఫెరెన్సు ద్వారా నిర్మాతలంతా సమావేశం కానున్నారు. ఇందులో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది.
లాక్ డౌన్ ఎత్తేస్తే చిత్రసీమ ఎలాంటి ముందడుగు వేయాలి? షూటింగులు ఎప్పటి నుంచి మొదలెట్టాలి? అనే విషయాల్ని గిల్డ్ చర్చించే అవకాశం ఉంది. లాక్ డౌన్ ఎత్తేసే పరిస్థితి లేకపోతే అప్పుడేం చేయాలి? అనే చర్చ కూడా జరగబోతోంది. ఓటీటీ వేదికల ద్వారా సినిమాల్ని విడుదల చేసుకునే విషయంలో ఉన్న సౌలభ్యాలేంటి? ప్రమాదాలేంటి? ఈ విషయంలో నిర్మాతలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది? అనే విషయాల్ని గిల్డ్ చర్చించే అవకాశం ఉంది.