మార్చి రెండో వారం నుంచే సినిమాలన్నీ బంద్ అయిపోయాయి. కొత్త సినిమా వచ్చి నెల రోజులైంది. లాక్ డౌన్ ఎప్పుడు ఎత్తేస్తారో తెలియని పరిస్థితి. ఒకవేళ ఎత్తేసినా… సినిమాల్ని రిలీజ్ చేసే అవకాశం ఉందో, లేదో కూడా తెలియని సందిగ్థ పరిస్థితుల్లో నిర్మాతలు ఉన్నారు. ఇప్పటికే పూర్తయిన సినిమాలు ల్యాబుల్లో మగ్గుతున్నాయి. అవి విడుదల చేస్తే గానీ, అప్పులు తీరవు. ఈలోగా వడ్డీలపై వడ్డీలు పెరిగిపోతుంటాయి. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో ఓటీటీ వేదికలు పెద్ద దిక్కుగా మారాయి. అమేజాన్, జీ, ఆహా లాంటి ఓటీటీ వేదికలు.. విడుదల కావాల్సిన కొన్ని సినిమాల్ని ఆకర్షించే ప్రయత్నాల్లో ఉన్నాయి.
ఒరేయ్ బుజ్జిగా, రెడ్, వీ, 30 రోజుల్లో ప్రేమించడం ఎలా… ఇలా ఇప్పటికే పూర్తయిన సినిమాలు పదుల సంఖ్యలో ఉన్నాయి. అవి ఎప్పుడు థియేటర్లకు వస్తాయో తెలీదు. ఈ కరోనా విలయతాండం జూన్ వరకూ కొనసాగే అవకాశం ఉందని, అప్పటికీ థియేటర్లు తెరుస్తారన్న గ్యారెంటీ లేదని వార్తలు వినిపిస్తున్నాయి. దాంతో నిర్మాతలలో కంగారు మొదలైంది. అప్పటి వరకూ సినిమాల్ని తమ చేతుల్లో ఉంచుకోలేరు. అందుకే ఓటీటీ వేదికలకు అమ్ముకోవడం మినహా మరో మార్గం లేకుండా పోయింది. ఓటీటీ సంస్థలు కూడా ఇలాంటి చిత్రాలకు ఆకర్షించే రేట్లే ఇస్తున్నాయని తెలుస్తోంది. రెడ్ సినిమాని 20 కోట్లకు కొనడానికి ఓటీటీ సంస్థ ముందుకొచ్చిందట. ఇది దాదాపుగా థియేటరికల్ రైట్స్ తో సమానం. థియేటర్లో సినిమా విడుదలైతే ఇంత వస్తుందన్న గ్యారెంటీ లేదు. ఒరేయ్ బుజ్జిగా బేరం 7 నుంచి 8 కోట్ల మధ్య జరుగుతుందని తెలుస్తోంది. ప్రదీప్ మాచిరాజు సినిమా `30చ రోజుల్లో ప్రేమించడం ఎలా`కీ మంచి రేటే చెబుతున్నార్ట. అయితే.. `వీ` సినిమాని ఓటీటీకి ఇవ్వడానికి దిల్ రాజు సముఖంగా లేడని తెలుస్తోంది. `రెడ్` విషయంలో నిర్మాతలు రెడీ అయినా, రామ్ మాత్రం `నో` అంటున్నాడట. ఒరేయ్ బుజ్జిగా విషయంలో దర్శకుడు అడ్డు పడుతున్నాడట.
రేపు థియేటర్లు రీ ఓపెన్ అయితే, సినిమాలు విడుదలైతే, ఇవన్నీ మంచి ఆదరణ దక్కించుకుంటాయని వారి వారి నమ్మకం. పైగా మన హీరోలు, నిర్మాతలు థియేటరికల్ రిలీజ్‌కి అలవాటు పడ్డారు. థియేటర్లో సినిమా విడుదలైతే ఓ తృప్తి. ఇస్మార్ట్ శంకర్ లాంటి మాస్ హిట్ తరవాత వస్తున్న సినిమా ఇది. థియేటరికల్ రిలీజ్‌ని వదులులకోవడానికి రామ్ ఇష్టపడపడం లేదు. ఒరేయ్ బుజ్జిగా, 30 రోజుల్లో ప్రేమించడం ఎలా? లఆంటి సినిమాలకు మాత్రం ఇది మంచి అవకాశం. థియేటర్లు ఓపెన్ అయినా, జనాలకు సినిమా మూడ్ ఉంటుందో లేదో తెలీదు. జనాలు థియేటర్లకు వస్తారో రారో, సినిమా ఆడుతుందో లేదో .. ఈ గ్యారెంటీలేం లేవు. ఇలాంటి పరిస్థితుల్లో సినిమాని ఓటీటీకి ఇచ్చుకుంటే… వడ్డీల భారం తగ్గుతుంది. మినిమం గ్యారెంటీ దొరుకుతుంది. నిర్మాత సేఫ్ అవుతారు. అందుకే.. మార్చి, ఏప్రిల్ లో విడుదల కావల్సిన కొన్ని సినిమాలు ఓటీటీ ఎగరేసుకుపోవడం ఖాయంగా కనిపిస్తోంది. మరి ముందడుగు ఏ సినిమాతోనే చూడాలి.