జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎస్‌ఈసీ రమేష్ కుమార్ ను తొలగించడానికి ప్రభుత్వం వ్యవహిరంచిన విధానంపై విరుచుకుపడ్డారు. కక్ష సాధింపు, మొండివైఖరి, ఏకపక్ష నిర్ణయాలతో జగన్ ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు. హైకోర్టుతో చీవాట్లు పెట్టించుకున్నా.. నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అన్న సామెతలా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. ఎన్నికల కమిషనర్‌ను తొలగించడానికి ఇది సమయం కాదని.. ఓ వైపు కరోనాతో ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారని గుర్తు చేశారు. వారి కోసం ప్రభుత్వం పని చేయాల్సి ఉందన్నారు. కరోనా ఉందని.. ప్రభుత్వంపై రాజకీయ విమర్శలు చేయకూడదని నిర్ణయించుకున్నట్లుగా పవన్ కల్యాణ్ శుక్రవారమే ప్రకటించారు.
ఇప్పుడు ఖండించాల్సిన పరిస్థితిని.. రాజకీయ విమర్శలు చేయాల్సిన పరిస్థితిని కల్పించారని.. పవన్ చెప్పుకొచ్చారు. కక్ష సాధింపు నిర్ణయాల కారణంగా ఆ నియంత్రణను దాటి మీ చర్యను ఖండించాల్సిన పరిస్థితిని మీరే సృష్టించారని వివరణ తరహాలో తన ప్రెస్ నోట్ చెప్పుకొచ్చారు. రాజకీయం చేయడం అంటే.. తప్పు అన్నట్లుగా పవన్ ఎందుకు భావిస్తున్నారో చాలా మందికి అర్థం కావడం లేదు. ప్రభుత్వంపై ఎంత ఒత్తిడి తీసుకు వస్తేనే.. అంత ఎక్కువగా ప్రజల కోసం ఆలోచిస్తుంది. అలా కాకుండా.. ఏమీ విమర్శించకుండా.. ఉంటే.. ఇష్టం వచ్చినట్లుగా ప్రభుత్వాలు చేస్తాయి. ప్రస్తుతం ఏపీలో అదే జరుగుతోంది. కరోనా విషయంలో తీవ్రమైన నిర్లక్ష్యంతో ప్రభుత్వం ఉందని.. కరోనా తప్ప.. మిగిలిన అన్ని విషయాలపై దృష్టి పెట్టి ప్రజారోగ్యంతో ఆడుకుంటోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజధాని భూములను ఇళ్ల స్థలాలుగా ఇచ్చేందుకు ఏర్పాట్లు చేయడం.. కోర్టు తీర్పులను కూడా పట్టించుకోకపోవడం వంటి అంశాలు ఏపీలో హైలెట్ అవుతున్నాయి.
అయినప్పటికీ.. స్వీయ నియంత్రణ పేరుతో పవన్ కల్యాణ్.. సైలెంట్ గా ఉండాల్సిన అవసరం ఏమిటో రాజకీయ నేతలకూ అర్థం కావడం లేదు. రాజకీయం చేస్తున్నారని వైసీపీ నేతలు ఎదురుదాడి చేస్తున్నా.. టీడీపీ అధినేత ప్రభుత్వ తీరుపై విరుచుకుపడుతున్నారు. దానికి వ్యక్తిగత విమర్శలతో.. వైసీపీ నేతలు సమాధానం చెబుతున్నారు కానీ.. సమస్యలపై స్పందించడం లేదు. కానీ.. చంద్రబాబు చెప్పిన అనేక అంశాలను ప్రభుత్వం ఆచరిస్తూ వస్తోంది. ఇలాంటి ప్రతిపక్ష నేత పాత్ర పోషించాల్సిన సమయంలో పవన్ కల్యాణ్ స్వీయ నియంత్రణతో ఉంటామని చెప్పడం.. జనసేన వర్గాలకు సైతం ఆశ్చర్యకరంగా ఉంది.