ఆంధ్రప్రదేశ్ కొత్త ఎన్నికల కమిషనర్‌గా తమిళనాడుకు చెందిన రిటైర్డ్ జడ్జి కనగరాజు బాధ్యతలు స్వీకరించారు. ఈ నియామకానికి గవర్నర్ కూడా ఆమోద ముద్ర వేసే వరకూ ప్రభుత్వం అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఎక్కడా… విషయం బయటకు రానివ్వలేదు. శుక్రవారమే.. ఎస్ఈసీ తొలగింపు ఆర్డినెన్స్ .. దాని ప్రకారం.. తొలగింపు జీవోలు ఇచ్చినట్లు మీడియాకు చెప్పినా… గుప్తంగా ఉంచారు. దీనికి కారణం ఎవరూ కోర్టుకు వెళ్లకూడదనే. శని, ఆదివారాలు కోర్టుకు సెలవులు కావడంతో.. ఈ లోపు… హుటాహుటిన కనకరాజును..లాక్ డౌన్ ఉన్నప్పటికి.. చెన్నై నుంచి విజయవాడకు పిలిపించారు. ఉదయమే.. పది గంటల లోపు… బాధ్యతలు స్వీకరింపచేశారు. ఆ తర్వాత మాత్రమే.. మొత్తం విషయంపై… అటు మీడియాకు.. ఇటు రాజకీయ నేతలకు ఓ క్లారిటీ వచ్చింది.
ఎస్ఈసీ నియామకాన్ని రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేస్తుంది కానీ..నియమించాల్సింది గవర్నరే. రమేష్ కుమార్ ను తొలగించాల్సి వస్తే.. రాజ్యాంగపరమైన అంశాలు తెరపైకి వస్తాయని.. గవర్నర్ ఆమోదించరని అంతా అనుకున్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ.. ఈ మేరకు.. ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పు పడుతూ.. ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని గవర్నర్‌కు లేఖలు రాశారు. అయినప్పటికీ గవర్నర్ కనగరాజు నియామకానికి ఆమోదముద్ర వేసేశారు. వెంటనే.. కనగరాజు బాధ్యతలు చేపట్టారు.
మరో వైపు తొలగింపునకు గురైన ఎస్ఈసీ రమేష్‌కుమార్ హైకోర్టులో హౌస్‌మోషన్ పిటిషన్ వేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. . ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించి కోర్టుకు సెలవులు అయిన రోజుల్లో.. పని పూర్తి చేయడంతో.. హౌస్ మోషన్ ఆప్షన్ ఎంచుకోవాలని రమేష్ కుమార్ నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం కరోనా కారణంగా హైకోర్టు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేసుల విచారణ చేపడుతోంది. రమేష్ కుమార్… తన తొలగింపు రాజ్యాంగ విరుద్ధమని భావిస్తున్నారు. ఐదేళ్ల పదవీ కాలానికి తనను నియమించారు. కొత్త ఆర్డినెన్స్‌లు తెస్తే.. కొత్తగా నియమితులయ్యే వారికి వర్తిస్తుంది కానీ తనకు కాదని.. తన పిటిషన్లో పేర్కొనే అవకాశం ఉంది. మొత్తానికి ఎస్ఈసీ వ్యవహారం కీలక మలుపులు తిరగడం ఖాయంగా కనిపిస్తోంది.